AP High Court: శిక్షమాఫీ దరఖాస్తుపై నిబంధనల మేరకు నిర్ణయం
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:24 AM
జీవితఖైదు అనేది 20 ఏళ్లు కాదు, మిగిలిన జీవితం అంతా కారాగార శిక్షేనని హైకోర్టు స్పష్టం చేసింది. చలపతిరావు విడుదలపై రెమిషన్ పిటిషన్‌ను చట్ట ప్రకారం పరిశీలించాలని ఆదేశించింది

చిలకలూరి పేట బస్సు దహనం కేసులో దోషికి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు
మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు
రెమిషన్ కోసం ఆనాటి పాలసీని పరిగణనలోకి తీసుకోవాలి
చలపతిరావు కేసులో రాష్ట్ర ప్రభుత్వం, జైళ్లశాఖ డీజీకి హైకోర్టు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): చిలకలూరిపేట బస్సు దహనం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్.చలపతిరావు శిక్ష మాఫీ(రెమిషన్) కోసం చేసుకొనే దరఖాస్తు విషయంలో చట్టనిబంధనలకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం, జైళ్లశాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. శిక్ష మాఫీకి దరఖాస్తు చేసుకొనే విషయాన్ని చలపతిరావుకే వదిలేసింది. చలపతిరావుకు గతంలో కోర్టు విధించిన మరణశిక్షను రాష్ట్రపతి జీవిత ఖైదుగా మారుస్తూ క్షమాభిక్ష పెట్టారని గుర్తు చేసింది. ఆ క్షమాభిక్ష నాటికి ఉనికిలో ఉన్న పాలసీకి అనుగుణంగా శిక్ష మాఫీ కోసం చలపతిరావు సమర్పించే దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఈనెల 9న తీర్పు ఇచ్చింది. గుంటూరు జిల్లాలో 1993 మార్చి 7న ఆర్టీసీ బస్సును దోపిడీ చేసే క్రమంలో పెట్రోల్ పోసి దహనం చేయగా.. మొత్తం 23మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో గుంటూరు మూడో అదనపు సెషన్స్ కోర్టు చలపతిరావుతో పాటు మరొకరికి మరణశిక్ష విధిస్తూ 1995 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ వీరిద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు. తదనంతరం మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ 1998 మే 21న రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు.
ప్రస్తుతం చలపతిరావు నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే నిమిత్తం తన తండ్రి శిక్షను మాఫీ చేసి విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చలపతిరావు కుమార్తె స్వప్న 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డి.సురే్‌షకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రిజన్ రూల్ 320(ఏ) ప్రకారం జీవిత ఖైదు అంటే 20 ఏళ్లు మాత్రమే అన్నారు. చలపతిరావు 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. సత్ప్రవర్తన కారణంగా చలపతిరావు విడుదలకు అర్హుడని చెప్పారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టేనాటికి అమల్లో ఉన్న పాలసీకి అనుగుణంగా చలపతిరావు శిక్షను మాఫీ చేయాల్సి ఉంటుందని వివరించారు. నెల్లూరు కేంద్రకారాగారం సూపరింటెండెంట్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ.. జీవితఖైదు శిక్ష పడిన ఖైదీలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం శిక్ష మాఫీకి అర్హులన్నారు. మరణశిక్షపడి తదనంతరం జీవిత కారాగార శిక్షగా మారిన ఖైదీల విషయంలో రెమిషన్ సాధ్యపడదని తెలిపారు. కారాగారంలో పిటిషనర్ ప్రవర్తన సంతృప్తికరంగా లేదన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. జీవిత ఖైదు అంటే మిగిలిన జీవిత కాలం మొత్తం కారాగారంలో ఉండడమేనని పేర్కొంది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేసింది. ఏపీ ప్రిజన్ రూల్ 320(ఏ), ఐపీసీలోని సెక్షన్ 57 పరిశీలించినా జీవిత ఖైదు అంటే 20 ఏళ్లకు పరిమితం చేసినట్లు లేదని తెలిపింది. చట్టనిబంధనలకు అనుగుణంగా రెమిషన్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది.