MLC Resignation: ఎమ్మెల్సీ జయమంగళ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:00 AM
ఎమ్మెల్సీ పదవికి రాజీనా మా చేస్తూ తాను సమర్పించిన లేఖపై శాసనమండలి చైర్మన్ నిర్ణయం వెల్లడించేలా...
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ పదవికి రాజీనా మా చేస్తూ తాను సమర్పించిన లేఖపై శాసనమండలి చైర్మన్ నిర్ణయం వెల్లడించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఆ పిటిషన్ సోమవారం విచారణకు రాగా.. ఆయన తరఫున న్యాయవాది అజయ్ వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనా మా సమర్పించామని.. ఆమోదించడం గానీ, తిరస్కరించడంగానీ చేయలేదన్నారు. తగిన ఉత్తర్వులు జారీ చేసేలా చైర్మన్‌ను ఆదేశించాలని కోరారు. చైర్మన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘నవంబరు 28న తన ముందు హాజరుకావాలని చైర్మ న్ ఈ నెల 8న పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చారు. ఫలానా విధంగా చేయండని చైర్మన్‌ను ఆదేశించడం అంటే.. కోర్టులు తమ అధికారి పరిధి ని దాటి వ్యవహరించడమే. పిటిషన్‌ను కొట్టివేయండి’ అని కోరారు. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ప్రకటించారు.