AP High Court: హాయ్‌ల్యాండ్‌లో దిద్దేందుకు కోటి ఖర్చు
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:47 AM
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసి, తాజాగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ, పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
డిజిటల్-మాన్యువల్ మూల్యాంకనాల్లో పెద్ద తేడా
62 శాతం మంది మాన్యువల్‌లో ఎంపిక కాలేదు
తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసి, తాజాగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ, పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఇరుపక్షాలలో ఎవరైన రాతపూర్వక వాదనలు దాఖలు చేయాలనుకుంటే సోమవారంలోగా సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించింది. అయితే, మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అప్పటి విచారణలోనే న్యాయమూర్తి నిర్ధారించారు. దీంతో 2022, మే 26న ఇచ్చిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష అర్హుల జాబితాను హైకోర్టు సింగిల్ జడ్జి రద్దు చేశారు. తాజాగా మెయిన్స్ నిర్వహించాలని, ఎంపిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేయాలని 2024, మార్చి 13న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ, నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు అప్పీల్ చేశారు. మరికొందరు.. సింగిల్ జడ్జి తీర్పులోని కొంతభాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు తుది విచారణ ప్రారంభించింది. గురువారం ప్రారంభమైన వాదనలు శుక్రవారం కొనసాగాయి. ఉద్యోగాలకు ఎంపికకాని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, కేఎస్ మూర్తి, న్యాయవాదులు జొన్నలగడ్డ సుధీర్, షేక్ సలీమ్ వాదనలు వినిపించారు. డిజిటల్ విధానంలో జరిగిన మూల్యాంకనంలో ఎంపికైన అభ్యర్థులలో 62శాతం మంది తదుపరి జరిపిన మాన్యువల్ మూల్యాంకనంలో ఎంపిక కాలేదన్నారు.
తెలుగు మాధ్యమంలో పరీక్షరాసిన అభ్యర్థులే ఎక్కువ నష్టపోయారని తెలిపారు. డిజిటల్ మూల్యాంకనంలో ఎంపికకాని అభ్యర్థులు, మాన్యువల్ మూల్యాంకనంలో మంచి పోస్టులు పొందారని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేసేందుకు జవాబుపత్రాలను ‘హాయ్‌ల్యాండ్’కు తరలించారని, మాన్యువల్ మూల్యాంకనాన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించారని తెలిపారు. అయితే, ఇలా ఇవ్వడాన్ని ఏపీపీఎస్సీలోని ఓ సభ్యుడు వ్యతిరేకించారన్నారు. ఈ అభ్యంతరాలను అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పట్టించుకోలేదని, స్ట్రాంగ్ రూమ్ నుండి జవాబుపత్రాలను హాయ్‌ల్యాండ్‌కు తరలించడం అనుమానించాల్సిన విషయమని వివరించారు. 2021, డిసెంబరు- 2022, ఫిబ్రవరి మధ్య హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరిగిందని, దీనికిగాను అదనంగా బార్‌కోడ్లు, ఓఎంఆర్ షీట్లు, కంట్రోల్ బండిల్స్‌ను ప్రింట్ చేయించారని తెలిపారు. అయితే ఆ ఫలితాలను ప్రకటించలేదన్నారు. ‘‘హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం కోసం మొత్తం రూ.1.19 కోట్లు ఖర్చు చేశారు. డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకనంలో కొద్దిశాతం మాత్రమే వ్యత్యాసం ఉందని, త్వరలో ఫలితాలు ప్రకటిస్తామని అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రకటించారు.
వీటన్నిటినీ పరిశీలిస్తే హాయ్‌ల్యాండ్ వేదికగా పేపర్లు దిద్దారనేది స్పష్టమవుతోంది. కొన్ని జవాబుపత్రాలలో రెండు చేతిరాతలు ఉన్న వ్యవహారంపై దర్యాప్తు కమిటీ ఏం తేల్చిందో స్పష్టత లేదు. మెయిన్స్ రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లేదా సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని నిర్ణయానికి వస్తే... అధికారులుగా వివిధ హోదాల్లో ఉన్న అభ్యర్థులను ఆ స్థానాల నుండి తొలగించండి.’’ అని వాదనలు వినిపించారు.
వారు ఎంపిక కాలేదు: ఏజీ
ఈ సందర్భంగా ధర్మాసనం అడిన పలు ప్రశ్నలకు ఏపీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ బదులిస్తూ.. రెండు రకాల చేతిరాతలు ఉన్న జవాబుపత్రాల అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలో ఎంపిక కాలేదన్నారు. రెండు చేతిరాతల వ్యవహారాన్ని తేల్చేందుకు ఏపీపీఎస్సీ కమిటీ వేసిందని, కమిటీ నివేదికను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. కోర్టు తుది తీర్పుకి లోబడి ఉంటామని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హామీ పత్రం ఇచ్చారని చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, పి. శ్రీరఘురాం, ఓ. మనోహర్‌రెడ్డి రిప్లై వాదనలు వినిపించారు.