Share News

AP High Court: నకిలీ నెయ్యి కేసులో చిన్నప్పన్నకు షాక్‌

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:51 AM

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో వైసీపీ ఎంపీ, నాటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నకు హైకోర్టు గట్టిషాక్‌ ఇచ్చింది.....

AP High Court: నకిలీ నెయ్యి కేసులో చిన్నప్పన్నకు షాక్‌

  • వైవీ సుబ్బారెడ్డి పీఏ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

  • నెయ్యి సరఫరా కంపెనీల నుంచి కిలోకు రూ.25 కమీషన్‌ తీసుకున్న చిన్నప్పన్న

  • ఎవరి ప్రోద్బలంతో వసూలు చేశారో తేలాల్సి ఉందన్న సిట్‌

  • అప్పట్లో వాడిన ఫోన్లను ఆయన ఇవ్వడం లేదని వెల్లడి

  • సిట్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో వైసీపీ ఎంపీ, నాటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నకు హైకోర్టు గట్టిషాక్‌ ఇచ్చింది. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. నకిలీ నెయ్యి సరఫరా వ్యవహారంలో బెయిల్‌ కోరుతూ చిన్నప్పన్న దాఖలుచేసిన వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. నకిలీ నెయ్యి సరఫరాలో చిన్నప్పన్నకు ఎలాంటి పాత్రా లేదన్నారు. నెయ్యి సరఫరా కంపెనీల నుంచి కమీషన్‌ తీసుకోవడంతో పాటు టీటీడీ వ్యవహారాల్లో తలదూర్చారనేదే ఆయనపై ఆరోపణ అని.. చిన్నప్పన్నకు పోలీసు కస్టడీ ముగిసిందని.. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటామని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. సిట్‌ తరఫున సీబీఐ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పీఎ్‌సపీ సురేశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. నకిలీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా, ఇతర డెయిరీల నుంచి చిన్నప్పన్న కిలోకు రూ.25 చొప్పున కమీషన్‌ డిమాండ్‌ చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. హవాలాలో పిటిషనర్‌కు సొమ్ము అందిందని.. చిన్నప్పన్నకు ముడుపులిచ్చామని నెయ్యి సరఫరా కంపెనీలకు చెందినవారు వాంగ్మూలాలు ఇచ్చారని.. ఎవరి ప్రోద్బలంతో కమీషన్‌ వసూలు చేశారో దర్యాప్తులో తేలాల్సి ఉందని తెలిపారు. టీటీడీ అప్పటి చైర్మన్‌ సుబ్బారెడ్డికి పిటిషనర్‌ పీఏగా ఉన్నారని.. ఆ సమయంలో వినియోగించిన ఫోన్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని వెల్లడించారు. చిన్నప్పన్నకు వైజాగ్‌లో 14 ఫ్లాట్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు. ఆర్ధిక లావాదేవీలు ముడిపడి ఉన్న కేసులలో నిందితులకు బెయిల్‌ మంజూరుపై సుప్రీంకోర్టు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందని.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. సిట్‌ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. చిన్నప్పన్న బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ సోమవారం నిర్ణయం వెల్లడించారు.

Updated Date - Dec 16 , 2025 | 06:44 AM