Share News

Bail Rejected: మోహిత్‌రెడ్డికి హైకోర్టు షాక్‌

ABN , Publish Date - Oct 08 , 2025 | 06:15 AM

మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (ఏ-39)కి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను...

Bail Rejected: మోహిత్‌రెడ్డికి హైకోర్టు షాక్‌

  • మద్యం కేసులో ముందస్తు బెయిల్‌ నిరాకరణ

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (ఏ-39)కి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి మంగళవారం తీర్పు ఇచ్చారు. మోహిత్‌రెడ్డి పిటిషన్‌పై న్యాయస్థానం గత నెలలో తుది విచారణ జరిపింది. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్‌ హోదాలో మోహిత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. మద్యం ముడుపుల సొమ్మును తరలించేందుకు అధికారిక వాహనాలు వినియోగించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లాగ్‌ బుక్‌లో గత ఏడాది మార్చి 3, 4, 5 తేదీల్లో అధికారిక వాహనం తిరుపతి పరిసరాల్లో తిరిగినట్లు నమోదు చేశారని.. వాస్తవానికి ఆ రోజు ఆ వాహనం హైదరాబాద్‌ వెళ్లిందని.. టోల్‌ ప్లాజా సీసీటీవీ ఫుటేజ్‌లో దాని నంబర్‌ రికార్డయిందని తెలిపారు. 2024 వరకు తుడా ఇచ్చిన అధికారిక వాహనం పిటిషనర్‌ అధీనంలోనే ఉందన్నారు. మద్యం ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును అధికారిక వాహనంలో తరలించినట్లు ఆయన గన్‌మెన్‌, మరికొందరు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. పిటిషనర్‌కు పూర్వ నేరచరిత్ర ఉందన్నారు. 2021 తర్వాత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ-38), ఆయన కుటుంబసభ్యులు అనేక కంపెనీల్లో భాగస్వాములు అయ్యారని.. చెవిరెడ్డి కుటుంబానికి చెందిన ఇన్‌ఫ్రా కంపెనీ ఖాతాకు 2022 నుంచి భారీగా సొమ్ము వచ్చి చేరిందని.. ఈ వ్యవహారంపై దర్యాప్తు సాగుతోందని.. అనుమానాస్పద లావాదేవీలపై పిటిషనర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని.. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దని కోరారు. గత నెల 24న వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేశారు. ప్రాసిక్యూషన్‌ వాదనలతో ఏకీభవించి.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ మంగళవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు.

Updated Date - Oct 08 , 2025 | 06:15 AM