High Court: వీడియో పోస్టు చేస్తే దోపిడీ కేసా?
ABN , Publish Date - Mar 12 , 2025 | 07:04 AM
రాష్ట్ర ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రిని అవమానించేలా వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఫిర్యాదు వస్తే.. దోపిడీకి పాల్పడ్డారనే

కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వండి
కర్నూలు 3 టౌన్ ఎస్‌హెచ్‌వోకు హైకోర్టు ఆదేశం
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రిని అవమానించేలా వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఫిర్యాదు వస్తే.. దోపిడీకి పాల్పడ్డారనే సెక్షన్ల కింద కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు నేరుగా కోర్టు ముందు హాజరుకావాలని కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోను ఆదేశించింది. నిందితుడు ప్రేమ్‌కుమార్ అరెస్టు, దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌హెచ్‌వోకు స్పష్టం చేసింది. వైసీపీ నేత ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేయడంలో, ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధింపులో ఎస్‌హెచ్‌వో, మేజిస్ట్రేట్ ఆలోచనా రహితంగా వ్యవహరించారని కోర్టు ఆక్షేపించింది. విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. రఘునందనరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో రోడ్లపై టోల్‌గేట్లు పెట్టి కూటమి ప్రభుత్వం వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయనుందని ప్రేమ్‌కుమార్ ఓ వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.
కాగా, తన తండ్రిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కొరిటిపాటి అభినయ్ గత ఏడాది డిసెంబరులో హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. నిందితులను అరెస్టు విషయంలో పోలీసులు చట్ట నిబంధనలు అనుసరించడం లేదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) టి. విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. ప్రేమ్‌కుమార్ అరెస్టు విషయంలో పోలీసులు చట్టనిబంధనల ప్రకారమే నడుచుకున్నారని తెలిపారు.