AP High Court: ఏళ్ల తరబడి ఒకేచోట విధులా
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:19 AM
భార్య లేదా భర్త సమీపంలో పనిచేస్తున్నారనే కారణం చూపి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, హోదాను అడ్డం పెట్టుకొని ఉద్యోగ సంఘాల నాయకులు ఏళ్ల తరబడి ఒకేచోట పని...
నాయకుల హోదాలో కొందరు, స్పౌజ్ కారణంతో మరికొందరు.. బదిలీల చట్ట నిబంధనలు ఇవ్వండి
ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
లోతైన విచారణ జరుపుతామని వెల్లడి
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): భార్య లేదా భర్త సమీపంలో పనిచేస్తున్నారనే కారణం చూపి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, హోదాను అడ్డం పెట్టుకొని ఉద్యోగ సంఘాల నాయకులు ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తుండడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. వీరి తీరుతో ఆయా స్థానాలకు రావాలనుకుంటున్న ఇతర ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని పేర్కొంది. ‘‘స్పౌజ్ కోటా కింద ఒకేచోట ఎన్నేళ్లు పనిచేయడానికి అవకాశం ఉంది?. ఉద్యోగ సంఘం నాయకులు ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేయవచ్చా?. చట్టనిబంధనలు ఏం చెబుతున్నాయి?. తదితర వివరాలను కోర్టు ముందు ఉంచండి.’’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. అనంతరం విచారణను జనవరి తొలి వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.