High Court: శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తే తప్పేముంది
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:29 AM
పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకగా నిర్వహిస్తే తప్పేముందని పిటిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
విశిష్ఠ వ్యక్తులను గౌరవించడంలో తప్పేముంది?
పిల్‌ను ఉపసంహరించుకోకుంటే ఖర్చులు విధిస్తామని హెచ్చరించిన ధర్మాసనం
ఉపసంహరించుకున్న పిటిషనర్
అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకగా నిర్వహిస్తే తప్పేముందని పిటిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న మూడు జిల్లాలకు సత్యసాయి ట్రస్టు ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారని సహచరుల ద్వారా తెలుసుకున్నామని తెలిపింది. అలాగే ఆసుపత్రులు, విద్యాసంస్థలు కూడా స్థాపించి ప్రజలకు సేవ చేశారని గుర్తు చేసింది. ఇలాంటి విశిష్ఠ వ్యక్తులను గౌరవించడంలో తప్పేముందని ప్రశ్నించింది. కేవలం సత్యసాయి ఒక్కరి జయంతినేకాక, రాష్ట్రంలో మొత్తం 22 మంది జయంతులను రాష్ట్రవేడుకగా నిర్వహిస్తున్నారని గుర్తు చేసింది. తగిన అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందా? అని ప్రశ్నించింది. ప్రజోపయోగ వ్యాజ్యాలు దాఖలు చేయాలని పిటిషనర్‌కు హితవు పలికింది. పిల్‌ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఖర్చులు విధించి కొట్టివేస్తామని హెచ్చరించింది. పిల్ ఉపసంహరణకు పిటిషనర్ అంగీకరించడంతో, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం పిల్‌ను ఉపసంహరణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా ప్రకటించడంతో పాటు నిర్వహణకయ్యే ఖర్చులను రెగ్యులర్ ఫండ్స్ నుండి ఖర్చు చేయాలని వివిధ శాఖలను కోరడాన్ని సవాల్ చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన భారత హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ... మొత్తం 22 మంది విశిష్ఠ వ్యక్తుల జయంతులను అధికారిక వేడుకగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
వేడుకలకు 10 కోట్లు
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బుధవారం పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబరు 23న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జయంతి వేడుకల నిర్వహణలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు పర్యాటక శాఖ నుంచి రూ.10 కోట్లు కేటాయించింది.