AP High Court: హాయ్‌ల్యాండ్‌లోనే దిద్దారు
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:04 AM
వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెర ుున్స్ పరీక్ష జవాబుపత్రాలను హాయ్‌ల్యాండ్‌లోనే మూల్యాంకనం చేశారని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూ ర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వంలోని.....
ఓఎంఆర్ షీట్లపై మార్కుల నమోదు .. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలపై రిటైర్డ్ న్యాయమూర్తి కమిటీ నివేదిక
అప్పీళ్లపై పునర్విచారణకు హైకోర్టు ఓకే
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెర ుున్స్ పరీక్ష జవాబుపత్రాలను హాయ్‌ల్యాండ్‌లోనే మూల్యాంకనం చేశారని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూ ర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వంలోని స్వతంత్ర కమిటీ నిర్ధారించింది. ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేసినట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనానికి కమిటీ తన నివేదికను అందించింది. గ్రూప్-1పై దాఖలైన అప్పీళ్లు సోమవారం విచారణకు రాగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందించారు. ‘‘అప్పీళ్లను తిరిగి ఓపెన్ చేసి విచారణ జరపాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశాం. దానిని అనుమతించాలి.’’ అని కోరారు. ఈ అభ్యర్థనపై ఏపీపీఎస్సీ, అభ్యర్థుల తరఫు న్యాయవాదులు స్పంది స్తూ.. అప్పీళ్లపై పునర్విచారణ చేపట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీంతో ధర్మాసనం అనుబంధ పిటిషన్‌ను అనుమతించింది. తీర్పును రిజర్వ్ చేసిన అనంతరం జరిగిన పరిణామాలు, కమిటీ నివేదిక దృష్ట్యా అప్పీళ్లపై పునర్విచారణ చేపట్టేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా కేసుకు సంబంధించి కోర్టు వద్ద ఉన్న రికార్డుల సర్టిఫైడ్ కాపీలను అభ్యర్థుల తరఫు న్యాయవాదులకు అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధారిస్తూ ఈ పరీక్షలో అర్హులుగా పేర్కొంటూ 2022, మే 26న ఏపీపీఎస్సీ ఇచ్చిన జాబితాను హైకోర్టు సింగిల్ జడ్జి రద్దు చేశారు. తాజాగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, ఎంపిక ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ 2024, మార్చి 13న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ, నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన కొందరు ఉద్యోగులు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అలాగే తీర్పులోని కొంతభాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరికొందరు అప్పీల్ వేశారు. ఈ అప్పీళ్లపై ఇటీవల తుది విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, తీర్పు ప్రతి సిద్ధం చేస్తుండగా 2022, జూన్ 24న హైకోర్టు డివిజనల్ బెంచ్ ఉత్తర్వుల అమలులో లోపాలను ధర్మాసనం గుర్తించింది. వాటిని నివృత్తి చేసుకొనేందుకు వీలుగా 2022, జూన్ 24న హైకోర్టు డివిజనల్ బెంచ్ ఉత్తర్వులకు అనుగుణంగా అభ్యర్థుల జవాబుపత్రాలను సీల్డ్ కవర్‌లో తమ ముందు ఉంచాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఈ అప్పీళ్లు ఇటీవల విచారణకు రాగా హాయ్‌ల్యాండ్‌లో జవాబుపత్రాల మూల్యాంకనం జరిగిందా?. ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేశారా?. లేదా? అనే విషయంపై వాస్తవాలు నిర్ధారించేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ చైర్మన్‌గా, బార్‌కౌన్సిల్ మాజీ చైర్మన్ గంటా రామారావు, నాగార్జున యునివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్‌లతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమక్షంలో జవాబుపత్రాలు, ఓఎంఆర్ షీట్లు పరిశీలించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులకు అనుమతిచ్చింది. కాగా, ఈ అప్పీళ్లు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి.