AP High Court Orders : అధికారిక జనాభా లెక్కల ఆధారంగానే ఆర్‌ఈటీ విధించాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:49 AM
రెస్టారెంట్ అండ్ బార్లపై విధించే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ఆర్‌ఈటీ) విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అధికారిక జనాభా లెక్కలను పక్కన....
అంచనా వేసిన జనాభా ప్రకారం ట్యాక్స్ విధించడానికి వీల్లేదు
హైకోర్టు కీలక ఉత్తర్వులు
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): రెస్టారెంట్ అండ్ బార్లపై విధించే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ఆర్‌ఈటీ) విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అధికారిక జనాభా లెక్కలను పక్కనపెట్టి అంచనా వేసిన జనాభా లెక్క ప్రకారం ఆర్‌ఈటీ విధించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఏపీ ఎక్సైజ్ రూల్స్-2025లోని రూల్ 3(టి) ప్రకారం జనాభా అంటే ‘అధికారికంగా ప్రచురించిన జనాభా లెక్క’ అని నిర్వచించారని పేర్కొంది. 2011 తరువాత అధికారికంగా జనాభా లెక్కలు జరగలేదని, ఆనాటికి మైదుకూరు మున్సిపాలిటీ జనాభా 45,790 మాత్రమేనని గుర్తు చేసింది. 50 వేలు కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీలలో ఆర్‌టీఈ కింద రూ.35 లక్షలు మాత్రమే వసూలు చేయాలని తేల్చి చెప్పింది. 2011 నుండి మున్సిపాలిటీ పరిధిలో జనాభా 1.9 శాతంగా పెరిగి ప్రస్తుతం 56,310కు చేరిందని మైదుకూరు మున్సిపల్ కమిషనర్ అంచనా వేశారని, ఆ లెక్కకు ఎలాంటి శాస్త్రీయత లేదని తెలిపింది. కమిషనర్ అంచనా వేసిన జనాభా లెక్క ఆధారంగా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ బార్‌కు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ఆర్‌ఈటీ)ని రూ.55 లక్షలుగా నిర్ణయిస్తూ కడప జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేసింది. తీర్పు అందిన ఆరు వారాల్లోపు పిటిషనర్ అభ్యర్థనను తిరిగి పరిశీలించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. నిర్ణీత గడువులోపు అభ్యర్థనను పునఃపరిశీలన చేయకుంటే మున్సిపాలిటీ జనాభా 50 వేలు లోపు ఉన్నట్లు పరిగణించి పిటిషనర్ నుండి రూ.35 లక్షల ఆర్‌ఈటీ వసూలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. మైదుకూరు మున్సిపాలిటీ కమిషనర్ అంచనా వేసిన జనాభా లెక్కల ప్రకారం ఆర్‌ఈటీని రూ.55 లక్షలుగా నిర్ణయిస్తూ కడప జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ లక్ష్మి వెంకటేశ్వర రెస్టారెంట్ అండ్ బార్ యజమాని చిన్నమాదన్నగారి వెంకట సుబ్బయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2011 అధికారిక జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని మాత్రమే ఆర్‌ఈటీని నిర్ణయించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిపిన న్యాయమూర్తి ఇటీవల నిర్ణయాన్ని వెల్లడించారు.