High Court: వారి బాగోగులపైనే మా ఆలోచన
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:27 AM
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ.. 90ఏళ్లు దాటిన వృద్ధురాలు. మనవరాలు శ్యామల మానసిక వికలాంగురాలు.
శేషగిరమ్మ, మనవరాలి పరిస్థితిపై నివేదికివ్వండి
8 న్యాయవాది రూపేశ్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ.. 90ఏళ్లు దాటిన వృద్ధురాలు. మనవరాలు శ్యామల మానసిక వికలాంగురాలు! వృద్ధురాలి కూతురు ఇటీవల మరణించింది. ల్యాండ్ పూలింగ్‌లో తమకున్న 5సెంట్ల స్థలాన్ని నిరక్షరాస్యత వల్ల పొరపాటున సీఆర్‌డీఏకు అప్పగించారు. నివాసం ఉండేందుకు తమకు ఆ స్థలం తప్ప మరొకటి లేదని, దాన్ని తిరిగి ఇప్పించాలని, లేకుంటే కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ అవ్వ, మనవరాలి విషయంలో న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీచేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి వారి పరిస్థితిని తెలుసుకొని, నివేదిక ఇవ్వాలని న్యాయవాది రూపేశ్‌ను ఆదేశించింది. స్వయంగా కారు ఏర్పాటు చేసి న్యాయవాదిని వారి నివాసానికి పంపించింది. వారిద్దరికీ పునరావాసం కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు సమర్పించాలని సీఆర్‌డీఏ అధికారులకు స్పష్టం చేసింది. ప్రస్తుతం వారు ఉన్న నివాసానికి దగ్గర్లోనే పునరావాసం కల్పించాలని పేర్కొంది. వైద్యుడిని పంపించి శ్యామల మానసిక పరిస్థితిని అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది. కూతురు వెంకాయమ్మ మరణించిన నేపధ్యంలో 90ఏళ్ల వయసు దాటిన శేషగిరమ్మ, మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆమె మనవరాలు శ్యామల బాగోగుల గురించి తాము ఆలోచిస్తున్నట్లు తెలిపింది. పునరావాసం విషయంలో అధికారుల చర్యలు సంతృప్తికరంగా ఉండాలని తేల్చిచెప్పింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా, పిటిషనర్లకు పునరావాసం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది కోరారు.