High Court: చెరువు నీరు ఇండోసోల్ ప్రాజెక్టుకా
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:50 AM
గ్రామస్తులు రోజువారీ అవసరాల కోసం వినియోగించే చెరువునీటిని ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకు ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
అనుమతులతోనే పైపులైన్ వేశారా?
క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించండి
నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామస్తులు రోజువారీ అవసరాల కోసం వినియోగించే చెరువునీటిని ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకు ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ముందుంచిన ఫొటోలను పరిశీలిస్తే నీటి తరలింపునకే పైపులైన్లు వేశారన్న పిటిషనర్ వాదనలో వాస్తవం ఉన్నట్లు కనపడుతోందని వ్యాఖ్యానించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని చేవూరు, చెన్నాయపాలెం గ్రామాల చెరువుల నుంచి ఆ సోలార్ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారా.. నీటి తరలింపునకు అనుమతులు ఉన్నాయా.. అనే విషయాలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అనుమతులు లేకుంటే నీటి తరలింపుపై ముందుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. తదుపరి విచారణ నాటికి నివేదికను తమ ముందుంచాలని స్పష్టంచేసింది. విచారణను నవంబరు 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుడ్లూరు మండలం చేవూరు, కావలి మండలం చెన్నాయపాలెం గ్రామాల పరిధిలోని చెరువు నీటిని ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకు తరలిస్తున్నారని ఆ రెండు గ్రామాల ప్రజలు పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది బుధవారం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రెండు గ్రామాల ప్రజలు చెరువు నీటిని తాగునీరు, ఇతర రోజువారీ అవసరాల కోసం వినియోగిస్తారని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ)ఎ్‌స.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సోమశిల నుంచి ఆ సోలార్ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని తరలించబోతున్నారని తెలిపారు.