High Court: పరకామణిలో చోరీ కేసులో రాజీపై సీఐడీ దర్యాప్తు
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:54 AM
తిరుమల తిరుపతి దేవస్థానాల పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు కీలక ఉత్తర్వులు.. విచారణాధికారి, టీటీడీ బోర్డు చైర్మన్, అధికారులు, ఫిర్యాదుదారు పాత్ర తేల్చండి
డీజీ స్థాయికి తగ్గని అధికారికి బాధ్యత అప్పగించండి
నిందితుడు, కుటుంబ సభ్యుల ఆస్తులపైనా విచారణ జరపాలి
స్థిర, చరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాలూ పరిశీలించండి
ఆదాయానికి తగినట్లే ఆస్తులు ఆర్జించారా?
వేరేవారికి ఆస్తులు దఖలు పరిచారో లేదో దర్యాప్తు చేయండి
ఏసీబీకి కూడా న్యాయమూర్తి నిర్దేశం
సీల్డ్ కవర్‌లో నివేదికలను తమ ముందుంచాలని స్పష్టీకరణ
నిందితుడు రవికుమార్‌పై రాజీకి అవకాశం లేని సెక్షన్ 409 కింద అభియోగాలు మోపకపోవడం ద్వారా దర్యాప్తు అధికారి, ప్రిసైడింగ్ అధికారి తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నాం.
రికార్డులన్నీ పరిశీలిస్తే 2023 జూన్ 1నాటికే రవికుమార్‌పై క్రిమినల్ చర్యలు ముగించారు. ఆ ఏడాది సెప్టెంబరు 9న కేవలం లాంఛనంగా లోక్ అదాలత్ వద్ద కేసును రాజీ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
- హైకోర్టు
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానాల పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో టీటీడీ బోర్డు, టీటీడీ అధికారులు, దర్యాప్తు అధికారి(ఐవో), పరకామణి అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి(ఏవీఎస్‌వో) సతీశ్‌కుమార్ పాత్రలపై దర్యాప్తు చేసి.. తదుపరి విచారణ నాటికి సీల్డ్ కవర్‌లో నివేదికను రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ద్వారా తమకు సమర్పించాలని ఆదేశించింది. కేసు దర్యాప్తు కోసం సీఐడీలో డీజీ స్థాయికి తగ్గని అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని స్పష్టం చేసింది. అలాగే పరకామణిలో చోరీకి పాల్పడిన సీవీ రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై డీజీ ర్యాంకు అధికారితో సమగ్ర దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది.
దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రతిపాదించి సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని తెలిపింది. కేసు రాజీకి సంబంధించి లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చాల్సింది ధర్మాసనమేనని.. అందువల్ల ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ఉత్తర్వుల ప్రతిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముం దుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. సీజ్ చేసి తమకు సమర్పించిన 16 బండిళ్ల రికార్డులను సీఐడీ డీజీకి అందజేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చింది. చోరీ కేసులో రాజీ ఉత్తర్వులు జారీ చేసిన అప్పటి తిరుపతి మొదటి తరగతి రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)లో ఉత్తర్వుల ప్రతిని పొందుపరచాలని రిజిస్ట్రార్(విజిలెన్స్)ను ఆదేశించింది. న్యాయవ్యవస్థలో పరిపాలనాపరమైన పారదర్శకత, సమగ్రత కోసం సదరు మేజిస్ట్రేట్‌ను తక్షణమే ప్రొటోకాల్ విధుల నుంచి పక్కనపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వుల ప్రతిని సంబంధిత పరిపాలనా కమిటీ ముందు ఉంచాలని రిజిస్ట్రార్(జ్యుడీషియల్)ను ఆదేశించింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను డిసెంబరు 2వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. ఈ వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని నిందితుడు రవికుమార్, అప్పటి ఏవీఎస్‌వో సతీశ్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.
409 కింద అభియోగాలు మోపాలి
కోర్టు ముందుంచిన రికార్డులను పరిశీలిస్తే... దర్యాప్తు అధికారి, టీటీడీ బోర్డు, టీటీడీ అధికారులు రాజీ ధోరణి, నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని స్పష్టమవుతోందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేసును విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రాజీ చేసే సమయంలో ప్రిసైడింగ్ అధికారి అనాలోచితంగా వ్యవహరించారని తెలిపారు. ‘పెద్ద జీయర్ మఠం తరఫున పరకామణిలో పర్యవేక్షణాధికారి బాధ్యతలు నిర్వర్తించేందుకు రవికుమార్‌ను నియమిస్తూ 1985 అక్టోబరులో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆయనపై 2023 ఏప్రిల్ 29న చోరీ కేసు నమోదయ్యేనాటికి 38 ఏళ్లుగా పరకామణిలో సేవలు అందిస్తున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనం పరిధిలోకే వస్తారు. ఈ నేపథ్యంలో రవికుమార్‌పై రాజీకి ఆస్కారం లేని ఐపీసీ సెక్షన్ 409(నేరపూరిత విశ్వాస ఘాతుకం)కింద కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించి ఉండాల్సింది. అదే ఏడాది మే 31న వేసిన చార్జిషీటులో సైతం సెక్షన్ 409 కింద అభియోగాలు మోపి ఉండాల్సింది. అయితే రాజీకి అవకాశమున్న సెక్షన్లు 379, 381 కింద మాత్రమే కేసు పెట్టారు. నిందితుడిపై మోపిన అభియోగాలు సరైనవేనా అనే విషయం పరిశీలించకుండా.. అనాలోచితంగా మేజిస్ట్రేట్ చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్నారు. చోరీ కేసులో రవికుమార్‌ను పోలీసులు అరెస్టు చేయలేదు. కేసు డైరీని పరిశీలిస్తే రవికుమార్ ఆస్తులపై క్రైమ్ బ్రాంచ్ గానీ, ఏసీబీ గానీ దర్యాప్తు చేసినట్లుగా ఎలాంటి వివరాలూ లేవు. శ్రీవారికి భక్తులు కానుకలను అర్పిస్తుంటారు. దేవుడే ఆ సొమ్ముకు పూర్తి హక్కుదారు. స్వామి తరఫున టీటీడీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది. శ్రీవారి ఆస్తికి అప్పటి ఏవీఎస్‌వో సతీశ్‌కుమార్ ఏవిధంగానూ యజమాని కాలేరు. ఈ నేపఽథ్యంలో టీటీడీ ఆమోదం లేకుండా చోరీ కేసును రాజీ చేసుకునే అధికారం ఆయనకు లేదు’ అని తేల్చిచెప్పారు.
లోతైన విచారణ అవసరం..
రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను శ్రీవారికి సమర్పిస్తామని 2023 మేలో రెండు దఫాలుగా ప్రతిపాదించారని.. టీటీడీ నిబంధనల ప్రకారం ఆస్తులను బహుమతిగా అంగీకరించడానికి కనీసం 30 రోజుల ముందు పత్రికల్లో ఆ విషయాన్ని ప్రచురించాలని న్యాయమూర్తి గుర్తుచేశారు. ‘రికార్డులను పరిశీలిస్తే పేపర్ పబ్లికేషన్ లేకుండానే గిఫ్ట్ డీడ్‌లను స్వీకరించేందుకు ఈవో, జాయింట్ ఈవో ప్రతిపాదించారు. అందుకు టీటీడీ చైర్మన్ అంగీకరించారు. 30 రోజుల ముందు పత్రికా ప్రకటన ఇవ్వాలన్న నిబంధనను పక్కనపెట్టి.. ఆస్తులు స్వీకరించేందుకు అప్పటి టీటీడీ చైర్మన్ అనుమతించడం, ఆ ఉత్తర్వుల్లో రవికుమార్‌పై ఉన్న చోరీ కేసును ప్రస్తావించకపోవడంపై లోతైన విచారణ అవసరం. ఇలా ఎందుకు చేశారనేది దీని వెనకున్న పలువురు వ్యక్తులు, అధికారులకే తెలుసు. ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలంటే లోతైన విచారణ అవసరమని భావిస్తున్నాం’ అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇదీ కేసు..
2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో జరిగిన కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని సమర్పించిన వినతిని టీటీడీ ఈవో పరిగణనలోకి తీసుకోకపోవడంతో జర్నలిస్టు ఎం.శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ చేశారు. పరకామణిలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి సీవీ రవికుమార్ డాలర్ల రూపంలో పెద్దఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారని, ఈ విషయంలో నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబరు 9న లోక్ అదాలత్ వద్ద రవికుమార్‌తో ఏవీఎస్‌వో వై.సతీశ్‌కుమార్.. రాజీ చేసుకున్నారని అందులో తెలిపారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న అన్ని రికార్డులను సీఐడీ ద్వారా సీజ్ చేయించడం.. పిటిషనర్ ఇచ్చిన వినతిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని టీటీడీ ఈవోను ఆదేశించడం తెలిసిందే. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా సతీశ్‌కుమార్, రవికుమార్ తరఫున సీనియర్ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. అలాగే.. ప్రస్తుత వ్యాజ్యంలో ఇంప్లీడ్ అయిన ఏపీ సాధు పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ఇంప్లీడ్ పిటిషన్ వేసినందుకు సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతికి బెదిరింపు ఫోన్స్ వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని కోరారు.