AP High Court: బార్‌కోడ్ సరిపోలుతోందా?
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:24 AM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న ఉద్యోగులు, అధికారులను విచారణకు దూరంగా ఉంచాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.....
తెలుసుకునేందుకు నిపుణుల పేర్లు ఇవ్వండి
గ్రూప్-1 పత్రాల మూల్యాంకనం పిటిషన్‌పైఅభ్యర్థులు, ఏపీపీఎస్సీకి హైకోర్టు స్పష్టీకరణ
కేసులో నిందితులుగా ఉన్న అధికారులను విచారణకు దూరంగా ఉంచాలని ఆదేశం
ఇప్పటికీ పారదర్శకత రాలేదని ఆక్షేపణ
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న ఉద్యోగులు, అధికారులను విచారణకు దూరంగా ఉంచాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికీ ఏపీపీఎస్సీ అధికారులు పారదర్శకంగా వ్యవహారించట్లేదని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలకు అనుగుణంగా కోర్టుకు సమర్పించిన అభ్యర్థుల జబాబుపత్రాలతో పాటు ఓఎంఆర్ షీట్‌లో అభ్యర్థుల వివరాలు ఉండే భాగాన్ని కోర్టుకు సమర్పించకపోవడాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణలో వాటిని కూడా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. అభ్యర్థులు జవాబుపత్రాలకు జత చేసిన ఓఎంఆర్ షీట్ల బార్ కోడ్‌లో సమాచారం, మ్యాన్యువల్ మూల్యాంకనం కోసం రెండోసారి ముద్రించిన బార్‌కోడ్‌లోని సమాచారం సరిపోలుతోందా? లేదా? అనే విషయాన్ని ఎలా నిర్ధారించారని ప్రశ్నించింది. ఆ విధంగా సరిపోలేలా బార్‌కోడ్లను తిరిగి ముద్రించడం సాధ్యమేనా? అని హైకోర్టు అడిగింది. తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నిపుణుల పేర్లను సూచించాలని అభ్యర్థులు, ఏపీపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధారిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం 2022, మే 26న ఏపీపీఎస్సీ ఇచ్చిన ఉద్యోగుల జాబితాను రద్దు చేశారు. తాజాగా మెయిన్స్ నిర్వహించాలని ఎంపిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేయాలని 2024, మార్చి 13న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ, ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థులు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా ఏపీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అదనపు అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. సొమ్ము చెల్లింపులకు సంబంధించి పలు చెక్కుల జిరాక్స్ కాపీలను అఫిడవిట్‌కు జత చేశామని తెలిపారు. అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం స్పందిస్తూ.. ఏపీపీఎస్సీ అక్రమాలపై సిట్ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఉద్యోగులు, అధికారులను ప్రస్తుత విచారణకు దూరంగా ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.