AP High Court: ఇలాగే నిద్రలో కొనసాగండి
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:45 AM
టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణం, లోక్ అదాలత్‌లో కేసు ఉపసంహరణ వ్యవహారంలో కౌంటర్ వేసేందుకు మరింత సమయం కోరడం పట్ల హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
టీటీడీని ఉద్దేశించి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
పరకామణి అక్రమాల వ్యవహారంలో కౌంటర్‌కు సమయం కోరడంపై అసహనం
ఓ దశలో టీటీడీ ఈవో హాజరుకు ఆదేశం
స్టాండింగ్ కౌన్సిల్ అభ్యర్థనతో ఉపసంహరణ
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణం, లోక్ అదాలత్‌లో కేసు ఉపసంహరణ వ్యవహారంలో కౌంటర్ వేసేందుకు మరింత సమయం కోరడం పట్ల హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఇలాగే నిద్రలో కొనసాగండి’’ అని టీటీడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వినతిపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుందో తాము తెలుసుకోవాలని భావించామని, కేసు వివరాలను కోర్టు ముందు ఉంచే ఉద్దేశం టీటీడీకి లేనట్లు కనబడతోందని వ్యాఖ్యానించింది. ఓ దశలో ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు టీటీడీ ఈవో హాజరుకు ఆదేశించింది. అయితే, టీటీడీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ పదేపద్దే అభ్యర్థించడంతో కౌంటర్ దాఖలుకు సమయం ఇచ్చేందుకు రూ.20 వేలు ఖర్చుల కింద చెల్లించాలని స్పష్టం చేసింది. దీనికి అంగీకరిస్తే వారం సమయం ఇస్తామని, హాజరు నుంచి ఈవోకు మినహాయింపు ఇస్తామని స్పష్టం చేసింది. దీనికి స్టాండింగ్ కౌన్సిల్ అంగీకరించడంతో సొమ్మును ఏపీ అడ్వొకేట్ అసోసియేషన్ వద్ద జమ చేయాలని ఆదేశించింది. మరోవైపు సీఐడీ సమర్పించిన రికార్డులను కోర్టు ముందు ఉంచాలని రిజిస్ట్రార్(జ్యుడీషియల్)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. 2023లో అప్పటి వైసీపీ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని సమర్పించిన వినతిని టీటీడీ ఈవో పరిగణనలోకి తీసుకోలేదు. దీనిని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ జర్నలిస్ట్ ఎం. శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పరకామణిలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి సీవీ రవికుమార్ డాలర్ల రూపంలో పెద్దఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారని పేర్కొన్నారు. ఈ విషయంలో నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, అప్పటి ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబరు 9న లోక్ అదాలత్ వద్ద అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై. సతీశ్‌కుమార్, నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్నారని వివరించారు. లోక్‌అదాలత్ వద్ద రాజీ చేసుకోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. దాని ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ కేసుతో ముడిపడిన తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రికార్డులు, లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్, టీటీడీ బోర్డు తీర్మానాలు, ప్రొసీడింగ్స్‌ను తక్షణం స్వాధీనం చేసుకోవాలని, వాటిని సీల్డ్ కవర్‌లో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో పోలీస్ వ్యవస్థ నిర్లిప్తితపై గత విచారణలో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసుకి సంబంధించిన రికార్డులు అన్నింటినీ తక్షణం సీజ్ చేసి ఈ నెల 17న(శుక్రవారం) తమ ముందు ఉంచాలని సీఐడీ డీజీని ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది.
రికార్డులు సమర్పించాం: సీఐడీ
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రికార్డులన్నింటినీ సీజ్ చేసి రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద జమ చేసినట్లు సీఐడీ నివేదించింది. ఉద్యోగి సీవీ రవికుమార్ తరఫున సీనియర్ న్యాయవాది సి. నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత వ్యవహారంలో విజిలెన్స్ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించిందన్నారు. దానిని కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టీటీడీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ శ్రీనివాసబాబు వాదనలు వినపిస్తూ.. కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. సమగ్ర కౌంటర్ వేసేందుకు అదనపు సమాచారం ఇవ్వాలని టీటీడీని కోరినట్టు తెలిపారు. ప్రస్తుత ఘటనకు సంబంధించి వాస్తవాలను నిర్ధారించేందుకు టీటీడీ తన పరిధిలోని అన్ని శాఖల అధిపతులతో సమావేశం నిర్వహిస్తోందన్నారు. సీఎ్‌సవో అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడిందన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘‘ప్రక్రియను మరో రెండేళ్లు కొనసాగనీయండి.’’ అని అసహనం వ్యక్తం చేశారు.