Share News

Jethwani Case Stay: ఆ పోలీసు అధికారులపై చర్యలొద్దు

ABN , Publish Date - May 09 , 2025 | 06:07 AM

కాదంబరి జెత్వాని ఫిర్యాదు కేసులో నిందితులైన పోలీసు అధికారులపై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్వాష్‌ పిటిషన్‌లపై విచారణ జూన్‌ 30కి వాయిదా వేసింది

Jethwani Case Stay: ఆ పోలీసు అధికారులపై చర్యలొద్దు

  • జెత్వాని కేసులో తదుపరి చర్యలు నిలుపుదల

  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ముంబయి సినీనటి కాదంబరి జెత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరిన పోలీసు అధికారులపై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. క్వాష్‌ పిటిషన్లపై విచారణను జూన్‌ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ప్రాసిక్యూషన్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు ఇప్పటికే ముందస్తు బెయిల్‌ పొందారని తెలిపారు.


ప్రస్తుత కేసులో వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవబోమని, తుది చార్జ్‌షీట్‌ దాఖలు చేయబోమని గతంలోనే హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో క్వాష్‌ పిటిషన్లపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వ్యాజ్యాలకు సంబంధించి కౌంటర్‌ వేయాల్సి ఉందని, విచారణను వేసవి సెలవుల తరువాతకి వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు స్పందిస్తూ... కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఇప్పటికే ప్రాసిక్యూషన్‌కు వెసులుబాటు ఇచ్చారని, పిటిషనర్ల విషయంలో కేసు ఆధారంగా తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కేసు ఆధారంగా అధికారులపై తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - May 09 , 2025 | 06:07 AM