AP High Court: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించండి
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:58 AM
మావోయిస్టు నేతలు మడ్వి హిడ్మా, మడ్వి రాజే అలియాస్ రాజక్క, మరో నలుగురు నక్సల్స్ ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ...
హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు నేతలు మడ్వి హిడ్మా, మడ్వి రాజే అలియాస్ రాజక్క, మరో నలుగురు నక్సల్స్ ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ... మెజిస్టీరియల్ విచారణ పై పిటిషనర్లకు అభ్యంతరం ఉంటే సెషన్స్ జడ్జిని ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కోర్టు ముందు ఉంచారు. ఆ తీర్పును అధ్యయనం చేసి రావాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఎన్‌కౌంటర్ ఘటన పై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ పీపుల్స్ యునిటీ ఫర్ సివిల్ లిబర్టీస్ హ్యుమన్ రైట్స్ ఫోరమ్ జాతీయ అధ్యక్షురాలు జయ వింధ్యాల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది చల్లా శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపిస్తూ... మావోయిస్టు నేతలను ఈ ఏడాది నవంబర్ 15న అదుపులోకి తీసుకొని, అదే నెల 18న ఫేక్ ఎన్‌కౌంటర్ చేశారన్నారు. ఈ మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.