Share News

High Court: సానుకూల నిర్ణయం ఆశిస్తున్నాం

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:35 AM

ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్‌ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

High Court: సానుకూల నిర్ణయం ఆశిస్తున్నాం

  • ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ధర్మాసనం

  • కర్ణాటక విధానంపై అధ్యయనం చేసి వివరాలివ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు

  • ధర్మాసనం ముందు హాజరైన హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్‌ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివక్ష, అనుభవిస్తున్న మానసికవేదనను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్‌ కల్పన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, కర్ణాటక రాష్ట్రం ఒకశాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేస్తోందని అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించేందుకు వీలుగా విచారణను నాలుగువారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2018నాటి ఎస్‌ఐ పోస్టుల నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వం రిజర్వేషన్‌ కల్పించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ గంగాభవాని అనే ట్రాన్స్‌జెండర్‌ 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందని పేర్కొన్నారు. ‘పిటిషనర్‌ పురుషుడిగా జన్మించారు. ఆ తరువాత లింగమార్పిడి ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారారు. ఎస్‌ఐ ఉద్యోగ దరఖాస్తులో స్త్రీ, పురుష ఐచ్ఛికం మాత్రమే ఇవ్వగా, పిటిషనర్‌ స్త్రీగా ఐచ్ఛికాన్ని ఎంచుకున్నారు. ప్రాథమిక పరీక్ష రాసి బీసీ రిజర్వేషన్‌ కోటాలో 35 మార్కులు సాధించారు. అయితే అధికారులు తరువాతి ప్రక్రియకు అనుమతించలేదు’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సాల్మన్‌రాజు నాడు వాదనలు వినిపించారు. వ్యాజ్యంపై విచారణ జరిసిన హైకోర్టు సింగిల్‌ జడ్జి వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ 2022 జనవరి 21న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ 2022 లో గంగాభవానీ ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు.


ఈ అప్పీల్‌పై గత ఏడాది డిసెంబరు 12న విచారణ జరిపిన ధర్మాసనం.. రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో నవంబరు 22 సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా గంగాభవాని ఉద్యోగంపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. ఈ నెల 6న జరిగిన విచారణకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి నివేదిక సమర్పించకపోవడంపై వివరణ ఇచ్చేందుకు నేరుగా హాజరుకావాలని ఆదేశించింది. అప్పీల్‌ సోమవారం మరోసారి విచారణకు రాగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ ధర్మాసనం ముందు హాజరయ్యారు. అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ సాంబశివ ప్రతాప్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ట్రాన్స్‌జెండర్ల విషయంలో 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ పాలసీ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే పిటిషనర్‌ వినతిని తిరస్కరిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్లకు కర్ణాటక అమలుచేస్తున్న ఒక శాతం రిజర్వేషన్‌పై అధ్యయనం జరుగుతోంది. వివరాలు సమర్పించేందుకు సమయమివ్వండి’ అని కోరారు.

Updated Date - Oct 28 , 2025 | 06:35 AM