High Court Dismisses YSRCP Repoll: వైసీపీ అభ్యర్థులకు హైకోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:33 AM
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పలు పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, కేంద్ర సాయుధ పోలీసు బలగాల భద్రతతో..
పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్‌కు వేసిన పిటిషన్లు కొట్టివేత
ట్రైబ్యునల్‌లో వేసుకొనేందుకు వెసులుబాటు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పలు పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, కేంద్ర సాయుధ పోలీసు బలగాల భద్రతతో రీపోలింగ్ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎ్‌సఈసీ) ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ట్రైబ్యునల్‌లో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు పిటిషనర్లకు స్వేచ్ఛనిచ్చింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఈ నెల 12న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఎర్రగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పి.వీరారెడ్డి, ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఉప ఎన్నికను రద్దు చేయాలని తాము కోరడం లేదని, అక్రమాలు జరిగిన పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని మాత్రమే కోరుతున్నామని వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. పులివెందుల జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి మారెడ్డి భరత్‌రెడ్డి, ఒంటిమిట్ట జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి ఎం.కృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.