High Court: గ్రూప్-2 నోటిఫికేషన్‌పై పిటిషన్ల కొట్టివేత
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:35 AM
గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది.
ఎంపిక ప్రక్రియ కొనసాగింపునకు వెసులుబాటు
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. విజయ్ తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వులతో ఎంపిక ప్రక్రియ కొనసాగింపునకు వెసులుబాటు లభించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్‌ను ఫిక్స్ చేసి గ్రూప్-2 పోస్టుల(897)కు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖకు చెందిన ఎం. పార్థసారథి, కడపకు చెందిన కనుపర్తి పెంచెలయ్యలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, క్రీడాకారులకు ప్రత్యేకంగా రోస్టర్ స్లాట్స్(రిజర్వేషన్ పాయింట్లు) కేటాయిస్తూ 2023, డిసెంబరు 7న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు కారు. పరీక్ష సరిగ్గా నిర్వహించలేదనేది వారు చెప్పడం లేదు. ఎంపిక ప్రక్రియలో విఫలమైన తర్వాత కోర్టును ఆశ్రయించారు. ఇలా చేయడానికి వీల్లేదు. రోస్టర్ పాయింట్ల విషయంలో ఏదైనా అభ్యంతరం ఉంటే సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన 2,538 మంది తేల్చుకోవాలి తప్ప ఎంపిక కాని అభ్యర్థులు సవాల్ చేయాడానికి వీల్లేదు’’ అని వాదించారు.