Jogi Ramesh: జోగి వ్యాజ్యానికి విచారణార్హత లేదు
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:29 AM
నకిలీ మద్యం తయారీ, సరఫరా విషయంలో నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ దాఖలు..
హైకోర్టులో ఏజీ దమ్మాలపాటి వాదనలు
అదనపు అఫిడవిట్ దాఖలుకు రమేశ్‌కు చాన్స్
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ, సరఫరా విషయంలో నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పష్టం చేశా రు. ఈ మేరకు బుధవారం హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తును ఏ సంస్థకు అప్పగించాలో నిందితుడుగా ఉన్న వ్యక్తి నిర్ణయించలేరన్నారు. వ్యాజ్యం దాఖలు చేసేనాటికి పిటిషనర్ కేసులో నిందితుడిగా లేరన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం వ్యాజ్యం దాఖలు చేసిన అనంతరం జరిగిన పరిణామాలు, వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ జోగి తరఫు సీనియర్ న్యాయవాదిని ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, జోగి రమేశ్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.