AP High Court: మేమున్నది పోలీసు శాఖను నడిపించడానికి కాదు
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:50 AM
వేకెన్సీ రిజర్వ్‌వీఆర్‌లో ఉన్న పోలీసులకు ఫలానా విధులు అప్పగించాలని తాము ఎలా ఆదేశించగలమని పిటిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది..
ఫలానా విధులు అప్పగించాలని ఆదేశించలేం
జీతాలు రాకుంటే పోలీసులే కోర్టును ఆశ్రయించవచ్చు
వారి తరఫున ఎంపీ పిల్ దాఖలు చేయడం ఏంటి?
పేద, అణగారినవర్గాల గొంతుక వినిపించేందుకే పిల్
పోలీసులు ఆ నిర్వచనం పరిధిలోకి రారు: హైకోర్టు
వైసీపీ ఎంపీ గురుమూర్తి వేసిన పిల్ కొట్టివేత
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉన్న పోలీసులకు ఫలానా విధులు అప్పగించాలని తాము ఎలా ఆదేశించగలమని పిటిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తామున్నది పోలీసు శాఖను నడిపించడానికి కాదని వ్యాఖ్యానించింది. వారి సేవలను ఎక్కడ వినియోగించుకోవాలో పోలీసు శాఖకు తెలుసని, ఫలానా విధులు అప్పగించమని తాము ఆదేశించలేమని తేల్చిచెప్పింది. జీతాలు రాకుంటే ఆ పోలీసులే నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు కదా? వారి తరఫున మీరు పిల్ దాఖలు చేయడం ఏంటని వైసీపీ ఎంపీ గురుమూర్తిని ప్రశ్నించింది. పేద, అణగారినవర్గాల గొంతుకను వినిపించేందుకు పిల్ ఉద్దేశించినదని, పోలీసులు ఆ నిర్వచనం పరిధిలోకి రారని పేర్కొంది. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో పోస్టింగ్‌ల కోసం వేచి ఉన్న/వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న పోలీసు అధికారులకు నిర్ణీత గడువులోగా పోస్టింగ్‌లు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అధికారులను దీర్ఘకాలం వీఆర్‌లో ఉంచడం, వారికి జీతాలు చెల్లించకపోవడంపై విచారణ జరిపేందుకు స్వతంత్ర కమిటీ వేయాలని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీస్ ఎస్టాబ్లి్‌షమెంట్ బోర్డు ఏర్పాటు చేసి పోలీసుల పోస్టింగ్‌లు, బదిలీలను బోర్డు ద్వారా చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎంత మంది పోలీసు అధికారులు వీర్‌లో ఉన్నారు? ఎంతకాలం నుంచి ఉన్నారు? వారికి జీతాలు ఎప్పటి నుంచి చెల్లించలేదనే వివరాలతో సమగ్ర నివేదిక కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిల్ బుధవారం విచారణకు వచ్చింది. వీఆర్‌లో ఉన్న పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తుతూ పోలీసు అధికారుల సంఘం లేదా జీతాలు అందని పోలీసులు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని హైకోర్టు గుర్తు చేసింది. పోలీసు అధికారుల పోస్టింగ్, బదిలీల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది. ఈ నేపఽథ్యంలో మార్గదర్శకాలు అమలు చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించే అధికారం తమకు లేదని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు తగిన వేదికను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. పిల్‌ను కొట్టివేసింది. అంతకుముందు పిటిషనర్ తరఫున న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. 199 మంది పోలీసు అధికారులను ప్రభుత్వం వీఆర్‌లో ఉంచిందని, జీతాలు సైతం చెల్లించడం లేదని అన్నారు. వీరికి కీలక పదవులు అప్పగించకుండా బందోబస్తు డ్యూటీలు వేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదన్నారు.