AP High Court: పరకామణిని ప్రక్షాళన చేయండి
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:52 AM
తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. కానుకల లెక్కింపులో ఏఐ, అత్యాధునిక యంత్రాలను వినియోగించడం ద్వారా....
ఏఐ తదితర సాంకేతికతలను వినియోగించండి
ఈ మేరకు రెండు దశల్లో సంస్కరణలు చేపట్టండి
టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు... విచారణ 26కు వాయిదా
అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. కానుకల లెక్కింపులో ఏఐ, అత్యాధునిక యంత్రాలను వినియోగించడం ద్వారా మానవ ప్రమేయాన్ని తగ్గించవచ్చని సూచించింది. హుండీల సీలింగ్, రవాణా, డీ సీలింగ్, లెక్కింపు, ఖాతాల నిర్వహణ విషయంలో పాత విధానాలనే అనుసరించడం సరికాదని అభిపాయ్రపడింది. దీనివల్ల దొంగతనాలు, అవినీతి, నిధుల దుర్వినియోగానికి అవకాశం కలుగుతోందని తెలిపింది. పరకామణికి సంబంధించి రెండు దశల్లో సంస్కరణలు చేపట్టాలని, ఇందుకోసం తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని టీటీడీని ఆదేశించింది. తక్షణ సంస్కరణలో భాగంగా., హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టాల్సినభద్రతా చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. శాశ్వత సంస్కరణలో భాగంగా కానుకలను వర్గీకరించడం, విదేశీ కరెన్సీని గుర్తించడం, విలువైన లోహాలు, రాళ్లు వేరు చేసేందుకు ఏఐ, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, దీనికోసం సాంకేతిక నిపుణులను నియమించుకోవాలని సూచించింది. టీటీడీకి సహాయం అందించేందుకు ఆయా రంగాల్లో అపార అనుభవం ఉన్న శ్రీవారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్నారని పేర్కొంది. శాశ్వత ప్రణాళికపై ఎనిమిది వారాల్లోపు ముసాయిదా రూపొందించి, దానిని కోర్టుకు సమర్పించాలని టీటీడీకి స్పష్టం చేసింది. నిందితుడు రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తులు వేరొకరికి బదలాయింపు, రిజిస్ట్రేషన్ వివరాలను సీల్డ్ కవర్‌లో వారంలోపు సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఉత్తర్వుల్లో ఏముందంటే...: ‘‘శ్రీవారికి హుండీలో భక్తులు వేసే కానుకలు, వారి విశ్వాసానికి ప్రతీకగా భావించాల్సి ఉంటుంది. ఆర్థిక విలువ కంటే వాటిని భక్తులు ఎంత భక్తి భావంతో సమర్పించారనేదే చూడాలి. దర్శనం, పూజలు, సేవలు, నైవేద్యం, ప్రసాదాల తయారీ, కానుకల లెక్కింపును టీటీడీ పాలకమండలి చూస్తుంది. వీటిల్లో ఏదైనా లోపం జరిగితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఽధర్మకర్త మండలి సాక్షాత్తూ దైవం తరఫున బాధ్యతలు నిర్వహిస్తోంది. భక్తుల మత పరమైన మనోభావాలను పరిరక్షించాల్సిన నైతిక, ధార్మిక బాధ్యత దీనిపై ఉంది. ఇందులో ఎలాంటి లోపం జరిగినా ధర్మకర్తల మండలి తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైనట్లే’’నని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.