Share News

High Court: సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి

ABN , Publish Date - Oct 16 , 2025 | 05:25 AM

మద్యం కేసులో బెయిల్‌ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని హైకోర్టు ఆదేశించింది.

High Court: సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి

  • ఏసీబీ కోర్టు బెయిల్‌ వ్యవహారంలో ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టు ఆదేశం

  • తదుపరి విచారణ 29కి వాయిదా

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో బెయిల్‌ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిథున్‌రెడ్డికి గత నెల 29న బెయిల్‌ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులో ప్రస్తావించిన పలు అంశాలు కేసు దర్యాప్తు మొత్తాన్ని బలహీనపర్చేలా ఉన్నాయని సీఐడీ తన పిటిషన్‌లో పేర్కొంది. గత విచారణలో ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అనుబంధ పిటిషన్‌పై నిర్ణయం తీసుకొనేవరకు బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరపవద్దంటూ ఏసీబీ కోర్టుకు సూచించింది. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్లు వేసిన నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. మిథున్‌ రెడ్డి బెయిల్‌ రద్దు కోసం వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా.. ఇతర నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరపకుండా వేచి ఉండాలన్న ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నారు. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఒత్తిడి చేసి ఉత్తర్వులు పొందామని చెప్పడాన్ని ఆక్షేపించారు. అనుబంధ పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించే వరకు వేచి ఉండాలని మాత్రమే హైకోర్టు ఆదేశించిందన్న విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసులో మెరిట్స్‌ ఆధారంగా ఏసీబీ కోర్టు, హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్‌ దాఖలుకు మిథున్‌రెడ్డిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Updated Date - Oct 16 , 2025 | 05:26 AM