Share News

High Court: పరకామణిలో దొంగతనం.. చిన్నచోరీ కాదు

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:17 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరుడి పరకామణిలో చోరీలను సాధారణ దొంగతనాలుగా చూడడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

High Court: పరకామణిలో దొంగతనం.. చిన్నచోరీ కాదు

  • కానుకల లెక్కింపునకు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులొద్దు: హైకోర్టు

  • కానుకలను దొంగిలిస్తే కోట్లాది భక్తుల

  • మనోభావాలు దెబ్బతింటాయి

  • లెక్కించే ప్రక్రియను ఆధునికీకరించాలి

  • మానవ ప్రమేయాన్ని తగ్గించండి

  • యంత్రాలు, ఏఐని వినియోగించండి

  • సేవాభావంతో లెక్కింపునకు భక్తులు ముందుకొస్తున్నారు

  • వారి దుస్తులూడదీసి సోదా చేయడం అమానుషం

  • పరకామణి ఆధునికీకరణపై సూచనలు,సలహాలతో మా ముందుకు రండి

  • ఇరుపక్షాలకు న్యాయమూర్తి సూచన

  • తదుపరి విచారణ 19వ తేదీకి వాయిదా

స్వామివారికి వచ్చే కానుకలను ఇప్పటికీ అస్తవ్యస్తంగా నేలపై పోసి లెక్కిస్తున్నారు. అలాకాకుండా బోర్డర్లు ఉన్న టేబుళ్లపై పోసి, లెక్కించే విధానం తీసుకొచ్చే అంశాన్ని టీటీడీ పరిశీలించాలి.

తప్పు చేయడానికి సులభమైన అవకాశం దొరికితే ఎంత ధర్మబద్ధమైన వ్యక్తి అయినా ప్రలోభానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. పరకామణిలో లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే సీసీటీవీలకు ఏఐని జోడించాలి.

-హైకోర్టు

అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరుడి పరకామణిలో చోరీలను సాధారణ దొంగతనాలుగా చూడడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. కానుకల లెక్కింపునకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. స్వామిపై ఉన్న భక్తితో కానుకలు ఇస్తారని, ఆ సొమ్ము చోరీకి గురయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంది. చోరీ ఘటనలు పునరావృతమవుతున్నా కానుకలు లెక్కించేందుకు అదే పాత విధానాన్ని టీటీడీ అనుసరించడాన్ని తప్పుబట్టింది. ఈ విధానాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని.. ప్రస్తుత విధానంలో మానవ ప్రమేయం అధికంగా ఉందని, దానిని తగ్గించాలని సూచించింది. కానుకల లెక్కింపునకు యంత్రాలు, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని టీటీడీకి సూచించింది. దొంగతనాలను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న భద్రతా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని.. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే సీసీటీవీలకు ఏఐని జోడించాలని సలహా ఇచ్చింది. దేవస్థానంలో కానుకలు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించాలని, ఆగమశాస్త్రానికి లోబడి వ్యవహరించాలని స్పష్టం చేసింది. అయితే హుండీ ప్యాకింగ్‌, పరకామణికి తరలింపు, కానుకలను వేరుచేయడం, వాటి లెక్కింపు విధానాన్ని సాధ్యమైనంత వరకు యాంత్రీకరించాలని టీటీడీకి సూచించింది.


మానవ ప్రమేయాన్ని తగ్గించడం ద్వారా దొంగతనాలను కట్టడి చేయవచ్చని తెలిపింది. సేవ పేరుతో కానుకల లెక్కింపునకు కోసం భక్తులను టీటీడీ ఆహ్వానిస్తోందని, వచ్చినవారి దుస్తులు ఊడదీసి డ్రాయర్లపై సోదాలు నిర్వహించడం అమానుష విధానమని తేల్చిచెప్పింది. సేవాభావంతో వచ్చినవారిని దొంగల్లా అనుమానించి, అవమానించడం సబబు కాదని తెలిపింది. శ్రీవారికి వచ్చే కానుకలు పరకామణికి తరలింపు, వాటిని వేరు చేసి లెక్కించే విధానాన్ని ఆధునికీకరించే విషయంలో తగిన సూచనలు, సలహాలతో తమ ముందుకు రావాలని టీటీడీకి, పిటిషనర్‌కు, దర్యాప్తు సంస్థలకు ఆదేశాలిచ్చింది. మరోవైపు.. పరకామణి చోరీ కేసును నిందితుడు రవికుమార్‌తో లోక్‌అదాలత్‌లో రాజీచేసుకున్న టీటీడీ అప్పటి ఏవీఎ్‌సవో సతీశ్‌కుమార్‌ మరణంపై పోస్టుమార్టం నివేదిక అందితే కోర్టు ఆఫీసర్‌కు అందజేయాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.


ఇదీ కేసు..

పరకామణిలో జరిగిన చోరీకి సంబంధించిన నమోదైన కేసును తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు తీర్మానం, కార్యనిర్వహణాధికారి (ఈవో) అనుమతి లేకుండానే 2023 సెప్టెంబరు 9న లోక్‌ అదాలత్‌ వద్ద నాటి ఏవీఎ్‌సవో వై.సతీశ్‌కుమార్‌, నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్న వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అలాగే పరకామణిలో చోరీకి పాల్పడిన సీవీ రవికుమార్‌, ఆయన కుటుంబ సభ్యుల స్థిర-చరాస్తులు, బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో పాటు.. వారు ఆ ఆస్తులను తమ ఆదాయానికి తగినట్లే ఆర్జించారా అనే కోణంలోనూ లోతైన దర్యాప్తు చేయాలని ఏసీబీని నిర్దేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు చేసి సీఐడీ, ఏసీబీ డీజీలు వేర్వేరుగా నివేదికలను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం దర్యాప్తులో భాగంగా సేకరించిన వివరాలను అవసరమైన మేరకు ఆదాయ పన్ను(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)తో పంచుకోవాలని సీఐడీ, ఏసీబీలను ఆదేశించింది. ఈ వ్యవహారంలో చట్టప్రకారం చర్యలు చేపట్టేందుకు డీజీలిద్దరికీ వెసులుబాటు ఇచ్చింది. సతీశ్‌కుమార్‌ పోస్టుమార్టమ్‌ సర్టిఫికెట్‌ ప్రతిని సీల్డ్‌ కవర్‌లో రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌)కు అందజేయాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. మంగళవారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా సీఐడీ దాఖలు చేసిన అదనపు నివేదికలో.. భక్తులు సమర్పించే కానుకలను పరకామణికి తరలించే విధానం, వాటిని వేరు చేసి లెక్కించే విధానంపై జతచేసిన ఫొటోలను కోర్టు పరిశీలించింది. పదే పదే చోరీ ఘటనలు జరుగుతున్నా అదే పాత విధానాన్ని టీటీడీ కొనసాగించడాన్ని తప్పుపట్టింది.

Updated Date - Dec 17 , 2025 | 04:19 AM