Share News

High Court: అంగన్‌వాడీల్లో మౌలిక సదుపాయాల కోసం పిల్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 05:34 AM

అంగన్‌వాడీ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్డి సదుపాయాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.

High Court: అంగన్‌వాడీల్లో మౌలిక సదుపాయాల కోసం పిల్‌

  • కౌంటర్‌ వేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్డి సదుపాయాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు, స్త్రీ శిశు సంక్షేమశాఖ కమిషనర్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్‌ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్‌ ద పీపుల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కీతినీడి అఖిల్‌ శ్రీ గురుతేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్‌ 5(2) ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - Dec 04 , 2025 | 05:37 AM