Share News

AP High Court: అంతిమ సంస్కారాలైనా హుందాగా జరగాలి

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:55 AM

మనిషి అంతిమ సంస్కారాలైనా హుందాగా జరగాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది.

AP High Court: అంతిమ సంస్కారాలైనా హుందాగా జరగాలి

  • శ్మశానాల్లో కనీస సదుపాయాల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

  • సీఎస్‌కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): మనిషి అంతిమ సంస్కారాలైనా హుందాగా జరగాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. పిటిషనర్‌ సమర్పించిన ఫొటోలను పరిశీలిస్తే నిర్వహణ లోపం కారణంగా శ్మశానవాటికలు ముళ్ల చెట్లతో నిండి అధ్వాన్నస్థితిలో ఉన్నాయని పేర్కొంది. రాజమండ్రిలో ఓ మృతదేహానికి అంతిమ సంస్కారాలు రోడ్డుపై నిర్వహించిన ఘటన శ్మశానవాటికల స్థితి, కొరతను తెలియజేస్తొందని వ్యాఖ్యానించింది. పరిపాలనాపరమైన విధానాలు అమల్లో ఉన్నప్పటికీ... శ్మశానాల నిర్వహణకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు నిరాసక్తత చూపిస్తుందని ప్రశ్నించింది. శ్మశానాల ఏర్పాటు, నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలు ఇచ్చినప్పటికీ, వాటి ఉద్దేశం నెరవేరలేదని, కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న శ్మశానవాటికల నిర్వహణకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాబోయే రెండు దశాబ్దాలకు అవసరాలను తీర్చేలా ఖనన/దహన వాటికల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు సమకూర్చాలని, రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.


రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలలో శ్మశాన వాటికల్లో కనీస అవసరాలైన నీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ దీపాలు, ఫెన్సింగ్‌, వేదికలు, షెడ్లు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన పి.ప్రమోద్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నిర్దిష్ట గడువులోగా యుద్ధప్రాతిపదికన వాటిని పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. శ్మశానవాటికల నిర్వహణ నిమిత్తం శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిల్‌ బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... నిర్వహణ లోపం కారణంగా శ్మశాన వాటికలు ముళ్ల చెట్లతో నిండిపోయాయన్నారు. పురపాలక శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది అంబటి శ్రీకాంత్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.... శ్మశాల నిర్వహణ బాధ్యత పట్టణ, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయితీలదే అన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 04:56 AM