High Court: కేజీబీవీల్లో నియామకాలపై వివరాలివ్వండి
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:04 AM
సర్వశిక్ష అభియాన్ పథకం కింద నడిచే కేజీబీవీ, ఇతర విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించడంపై వివరాలు సమర్పించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ...
కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): సర్వశిక్ష అభియాన్ పథకం కింద నడిచే కేజీబీవీ, ఇతర విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించడంపై వివరాలు సమర్పించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ బట్టుదేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కేజీబీవీల్లో పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీలు)గా పనిచేస్తు న్నవారు తమను అర్ధంతరంగా తొలగించారని పేర్కొంటూ 2023లో హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పిటిషనర్లను కొనసాగించాలన్నారు. దీన్ని సవాల్ చేస్తూ అధికారులు 2024 జనవరిలో ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సోమవారం అప్పీల్ విచారణకురాగా.. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి తరఫున ప్రభుత్వ న్యాయవాది రామచంద్రరావు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్ కారణంగా కేజీబీవీల్లో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరపలేకపోతున్నామన్నారు. కేంద్రం తరఫున హాజరైన ఏఎ్‌సజీ చల్లా ధనంజయ.. ఏటా కాంట్రాక్ట్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకోవాలని కేంద్రం సర్క్యులర్ ఇచ్చిందని కోర్టుకు తెలిపారు.