High Court Orders: సవేంద్రరెడ్డి కేసు సీబీఐకి
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:18 AM
వైసీపీ వలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవేంద్రరెడ్డి అరెస్టు విషయంలో పోలీసులు తమ చట్టవిరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు, గంజాయి కేసులోకి లాగారని...
దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థకు హైకోర్టు ఆదేశం
సుమోటో ప్రతివాదిగా సీబీఐ రాష్ట్ర విభాగాధిపతి
13 నాటికి ప్రాథమిక నివేదిక సమర్పించాలని స్పష్టీకరణ
కేసు వివరాలను సీల్డ్ కవర్‌లో సీబీఐకి అప్పగించాలని రిజిస్ట్రీకి ఆదేశం
సవేంద్రరెడ్డి అరెస్టు సమయంలో పోలీసులు చట్టనిబంధనలు అనుసరించలేదు
ధర్మాసనం ప్రాథమిక అభిప్రాయం
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ వలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవేంద్రరెడ్డి అరెస్టు విషయంలో పోలీసులు తమ చట్టవిరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు, గంజాయి కేసులోకి లాగారని హైకోర్టు ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే అక్టోబరు 13 నాటికి ప్రాథమిక నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. సీబీఐ ఏపీ విభాగాధిపతి(విశాఖపట్నం)ని సుమోటోగా వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చింది. సవేంద్రరెడ్డి సెల్ టవర్ లొకేషన్ డేటా, తాడేపల్లి పోలీసు స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ, కోర్టు ముందుంచిన రిమాండ్ రిపోర్టు ప్రతి, సవేంద్రరెడ్డి భార్య తాడేపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును సీల్డ్ కవర్‌లో ఉంచి.. సీబీఐ దర్యాప్తు అధికారికి అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబరు 13కి వాయిదా వేసింది. అప్పటివరకు సవేంద్రరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్త, తాడేపల్లికి చెందిన కుంచాల సవేంద్రరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన భార్య లక్ష్మీప్రసన్న ఈ నెల 22న అత్యవసరంగా హైకోర్టులో హెబియస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. 22న రాత్రి 7.30-8.45 మధ్య సవేంద్రరెడ్డిని అరెస్టు చేశామని ప్రత్తిపాడు పోలీసులు చెబుతున్నారని.. మరోవైపు తన భర్తను కిడ్నాప్ చేశారని తాను రాత్రి 7 గంటలకే తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని లక్ష్మీప్రసన్న చెబుతున్న నేపథ్యంలో..
వాస్తవాలను తేల్చేందుకు 22న సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పోలీసు స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌ను తమ ముందుంచాలని తాడేపల్లి పోలీసులను ఆదేశించింది. అలాగే ఆ రోజు సవేంద్రరెడ్డి ఫోన్ టవర్ లొకేషన్‌ను గుర్తించి వివరాలు సమర్పించాలని జియో టెలికాం సంస్థకు స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యం శుక్రవారం మరోసారి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. తమ ముందుంచిన రికార్డులను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల వైఖరిని తప్పుపట్టింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి ప్రాథమిక నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.