High Court: జోగి వ్యాజ్యంలో కౌంటర్ వేయండి
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:37 AM
నకిలీ మద్యం తయారీ, సరఫరా విషయంలో నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఈ కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై...
మద్యం కేసు సీబీఐకి బదిలీపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ, సరఫరా విషయంలో నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఈ కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. నకిలీ మద్యం తయారీ, సరఫరాకు సంబంధించి అన్నమయ్య జిల్లా మొలకలచెరువు, విజయవాడ భవానీపురం పీఎస్‌లో నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని జోగి రమేశ్ తన పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావు పోలీసు కస్టడీలో ఉండగా వీడియో వాంగ్మూలం రికార్డు చేసి మీడియాకు విడుదల చేసిన వ్యవహారంపైనా సీబీఐతో దర్యాప్తు చేయించాలని జోగి తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.. పిటిషన్ దాఖలు అనంతరం జరిగిన పరిణామాలు, వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు జోగిని ఆదేశించింది. బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అదనపు అఫిడవిట్ దాఖలు చేశామని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... వ్యాజ్యం విచారణార్హతపై కౌంటర్ దాఖలు చేస్తామని.. అందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషన్ విచారణార్హతపైనే కాకుండా ప్రధాన వ్యాజ్యంలో సైతం కౌంటర్ వేయాలని పీపీకి సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు.