Share News

AP High Court: నందిగం రాణికి ముందస్తు బెయిల్‌ ఇవ్వలేం

ABN , Publish Date - Nov 29 , 2025 | 05:10 AM

హర్షిత స్కూల్‌ చైర్‌పర్సన్‌ నందిగం రాణికి మందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నేర తీవ్రత ఉన్న కేసుల్లో నిందితులకు...

AP High Court: నందిగం రాణికి ముందస్తు బెయిల్‌ ఇవ్వలేం

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): హర్షిత స్కూల్‌ చైర్‌పర్సన్‌ నందిగం రాణికి మందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నేర తీవ్రత ఉన్న కేసుల్లో నిందితులకు రక్షణగా ఉత్తర్వులు జారీచేస్తే వారు దర్యాప్తునకు ఆటంకం కలిగించడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, తద్వారా న్యాయానికి విఘాతం కలుగుతుందని పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాణి కుటుంబసభ్యులు, బంధువులు ఐదుగురికి కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది. ఒక్కొకరు రూ.2లక్షల బాండ్‌తో మూడు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. చార్జిషీట్‌ దాఖలు చేసేవరకూ ప్రతి శనివారం ఎస్‌హెచ్‌వో ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఎస్‌హెచ్‌వో అనుమతి లేకుండా జిల్లా సరిహద్దు దాటి వెళ్లడానికి వీల్లేదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ వై.లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలం, తడికలపూడి గ్రామంలో హర్షిత పాఠశాల, జూనియర్‌ కాలేజ్‌ చైర్‌పర్సన్‌ నందిగం రాణి, ఆమె భర్త రూ.33 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడ్డారంటూ కొర్రపాటి చంద్రశేఖర్‌ మంగళగిరి సీఐడీ పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగా నందిగం రాణి, ఆమె భర్త ధర్మరాజు, కుమార్తె లక్ష్మీ హర్షిత, ఆమె తండ్రి గవిర్ని కృష్ణారావు, సోదరులు రమేశ్‌, సురేష్‌, వదిన గవిర్ని యజ్ఞవల్లిపై గతేడాది ఆగస్టులో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నందిగం రాణి, ఇతరులు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Nov 29 , 2025 | 05:10 AM