High Court: సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముంది
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:32 AM
దేవాలయాల్లో అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు, మైనర్ల హక్కులకు భంగం కలిగినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకుని.. తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం...
ఆలయాల్లో అక్రమాలు జరిగినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకోవచ్చు: హైకోర్టు
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): దేవాలయాల్లో అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు, మైనర్ల హక్కులకు భంగం కలిగినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకుని.. తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయాల ప్రయోజనాలను కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు కోర్టులేనని పేర్కొంది. తిరుమల పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడం చిన్న విషయం కాదని, నిందితుడు రవికుమార్‌తో అప్పటి ఏవీఎస్‌వో సతీశ్‌కుమార్ లోక్ అదాలత్ వద్ద కేసు రాజీ చేసుకునే అధికారం లేదని సింగిల్ జడ్జి ప్రాథమికంగా మాత్రమే అభిప్రాయపడ్డారని.. లోక్‌అదాలత్ ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే వ్యవహారాన్ని అంతిమంగా డివిజన్ బెంచ్‌కే అప్పగించారని గుర్తు చేసింది. ఆ ఉత్తర్వుల్లో తప్పేముందని పిటిషనర్‌ను సూటిగా ప్రశ్నించింది. కేసు రాజీకి సంబంధించి లోక్ అదాలత్ ఇచ్చిన అవార్డుకు చట్టబద్ధత ఉందా లేదా అనే అంశంపై వాదనలు వినిపించాలని ఆయనకు సూచించింది.
అప్పీల్‌పై తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన సీజే ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతిని ప్రస్తుత వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామని.. దీనిని అనుమతించాలని కోర్టును సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ.. కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. తదుపరి విచారణలో పరిశీలిస్తామని పేర్కొంది. విచారణను 11కి వాయిదా వేసింది. రవికుమార్ తరఫున సీనియర్ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపించారు.