Share News

High Court: ఎందుకంత జాప్యం

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:27 AM

ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి పదవీ విరమణ ప్రయోజనాలు(టెర్మినల్‌ బెనిఫిట్స్‌) చెల్లించడంలో జరుగుతున్న జాప్యాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

High Court: ఎందుకంత జాప్యం

  • రిటైర్మెంట్‌ ప్రయోజనాల చెల్లింపుల తీరుపై హైకోర్టు అసంతృప్తి

  • టెర్మినల్‌ బెనిఫిట్స్‌ చెల్లించడం దాతృత్వం కాదు

  • గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ పొందడం ఉద్యోగుల హక్కు

  • పిటిషనర్లకు 10 శాతం వడ్డీతో ప్రయోజనాలు చెల్లించండి

  • కేడీసీసీ బ్యాంకును ఆదేశించిన ధర్మాసనం

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి పదవీ విరమణ ప్రయోజనాలు(టెర్మినల్‌ బెనిఫిట్స్‌) చెల్లించడంలో జరుగుతున్న జాప్యాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఏళ్ల తరబడి సేవలు అందించిన ఉద్యోగులకు చట్టంలో నిర్దేశించిన మేరకు బెనిఫిట్స్‌ చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. వీటిని చెల్లించడం దాతృత్వం కాదని, అది వారి హక్కు అని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 300ఏ ప్రకారం పదవీ విరమణ ప్రయోజనాలు ఆస్తి కిందికి వస్తాయని తెలిపింది. అధికరణ 21 ప్రకారం జీవనోపాధి హక్కులో అవి అంతర్భాగమని పేర్కొంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదనే కారణం చూపి ఉద్యోగుల భద్రత హక్కును కాలరాయలేరని, చట్ట నిబంధనల ప్రకారం పద వీ విరమణ చేసిన ఉద్యోగి దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి 30 రోజుల్లోగా గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత ఉందని, విఫలమైతే ఆరోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. పిటిషనర్లకు చెల్లించిన టెర్మినల్‌ బెనిఫిట్స్‌లో వాటాను పీఏసీఎస్‌ నుంచి వసూలు చేసుకొనే హక్కు డీసీసీబీకి ఉందని పేర్కొంది. కోర్టు ఖర్చు ల కింద పిటిషనర్లకు రూ.10వేలు చెల్లించాలని ఆదేశించిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) పరిపాలన నియంత్రణలో చిట్టిబోయి న భారతరావు, పి.చంద్రమౌళీశ్వరరావు, బండ శివరామకృష్ణప్రసాద్‌, ఏ.సాయిబాబు పెయిడ్‌ సెక్రటరీలుగా నియమితులయ్యారు. వీరు పదవీ విరమణ చేసిన అనంతరం బెనిఫిట్స్‌ చెల్లించలేదు. దీంతో 2016లో వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - Nov 05 , 2025 | 04:30 AM