Share News

AP High Court: మొదటి నుంచీ దర్యాప్తు చేయొద్దు

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:55 AM

దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన వ్యవహారంలో తదుపరి దర్యాప్తు చేసే స్వేచ్ఛ దర్యాప్తు అధికారి(ఐవో)కి ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది.

AP High Court: మొదటి నుంచీ దర్యాప్తు చేయొద్దు

  • డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు అధికారికి హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన వ్యవహారంలో తదుపరి దర్యాప్తు చేసే స్వేచ్ఛ దర్యాప్తు అధికారి(ఐవో)కి ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే నిష్పాక్షికంగా దర్యాప్తు నిర్వహించాలని కోరే హక్కు నిందితుడికి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసును మొదటి నుంచీ తిరిగి దర్యాప్తు చేయడానికి వీల్లేదని ఐవోకు స్పష్టత ఇచ్చింది. రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు హత్య విషయంలో తదుపరి దర్యాప్తు జరుపవచ్చని పేర్కొంది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు గురువారం నిర్ణయం వెలువరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 మే 19న కాకినాడకు చెందిన తన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి మృతదేహంపై 33 గాయాలు ఉన్నాయని.. ఈ కేసులో అనంతబాబును మాత్రమే నిందితుడిగా చేర్చారని, హత్యలో మరికొందరి పాత్ర కూడా ఉందని సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై విచారణ జరిపిన న్యాయాధికారి.. కేసులో తదుపరి దర్యాప్తు జరిపేందుకు అనుమతిస్తూ జూలై 22న ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అనంతబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు.. హత్య కేసు తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఆ ఉత్తర్వులపై స్టే విధించలేమని తేల్చిచెప్పింది. తదుపరి దర్యాప్తు పేరుతో పోలీసులు కేసును పునర్విచారణ చేయబోతున్నారని అనంతబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు గురువారం స్పష్టత ఇచ్చింది.

Updated Date - Aug 01 , 2025 | 05:55 AM