Share News

Liquor Scam Case: డీఫాల్ట్‌ బెయిల్‌ రద్దు

ABN , Publish Date - Nov 20 , 2025 | 04:51 AM

మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు హైకోర్టు గట్టి షాకిచ్చింది.....

Liquor Scam Case: డీఫాల్ట్‌ బెయిల్‌ రద్దు

  • మద్యం స్కాం కేసులో..

  • ధనుంజయ్‌రెడ్డి బ్యాచ్‌కు హైకోర్టు షాక్‌!

అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ ముగ్గురికీ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్‌ బెయిల్‌ను రద్దు చేసింది. ఈ నెల 26లోగా ఏసీబీ కోర్టు ముందు లొంగిపోవాలని ముగ్గురినీ ఆదేశించింది. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్ల దాఖలుకు వారికి వెసులుబాటు ఇచ్చింది. ప్రస్తుత పిటిషన్‌లో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా మెరిట్స్‌ ఆధారంగా బెయిల్‌ పిటిషన్ల పై విచారణ జరిపి నిర్ణయం వెల్లడించాలని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి బుధవారం తీర్పు వెలువరించారు. వాస్తవానికి ముగ్గురు నిందితులూ ఈ నెల 24లోపు లొంగిపోవాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఆ తర్వాత వారి తరఫు సీనియర్‌ న్యాయవాదుల అభ్యర్థనతో 26 వరకు అవకాశమిచ్చారు. మద్యం స్కాంలో సిట్‌ దాఖలు చేసిన చార్జిషీటు, అనుబంధ చార్జిషీటు అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో ధనుంజయ్‌రెడ్డి(ఏ-31), కృష్ణమోహన్‌రెడ్డి(ఏ-32), బాలాజీ గోవిందప్ప(ఏ-33)కు ఏసీబీ కోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 6న నిబంధనలకు విరుద్ధంగా డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై సెప్టెంబరు 26న న్యాయస్థానం విచారణ జరిపింది. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఆ ముగ్గురు నిందితులకు సంబంధించి దర్యాప్తు ముగియడంతో తుది చార్జిషీటు దాఖలు చేశామని.. ఇతర నిందితుల విషయంలో విచారణ కొనసాగుతోందని ప్రాసిక్యూషన్‌ మొదటి నుంచీ చెబుతోందన్నారు. ‘సీఐడీ జూలై 19న చార్జిషీటు దాఖలు చేసిన అనంతరం ప్రత్యేక కోర్టు పలుసార్లు నిందితుల రిమాండ్‌ పొడిగించింది. ఆ ఉత్తర్వుల్లో చార్జిషీటు దాఖలు చేసినట్లు స్పష్టంగా పేర్కొంది. దానిని దాఖలు అనంతరం నిందితులు వేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది కూడా. తదనంతరం ఆగస్టు 23న ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆఫీస్‌ మెమోరాండం ఆధారంగా చేసుకుని నిందితులు డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్లు వేశారు. వారు దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌, డీఫాల్ట్‌ బెయిల్‌ వ్యాజ్యాలపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసే విషయంలో చట్టనిబంధనలు అనుసరించలేదు. అమల్లో లేని ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని నిందితులకు ప్రత్యేక కోర్టు డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. డీఫాల్ట్‌ బెయిళ్లను రద్దు చేయండి’ అని కోరారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి.. బుధవారం తన నిర్ణయం వెల్లడించారు.

Updated Date - Nov 20 , 2025 | 04:51 AM