High Court Verdict: 2022 నాటి జిల్లా జడ్జీల సీనియారిటీ జాబితా రద్దు
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:59 AM
జిల్లా జడ్జీల సీనియారిటీ జాబితా విషయంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. వారి సీనియారిటీని నిర్ణయిస్తూ 2022 జనవరి 5న హైకోర్టు రిజిస్ట్రీ జారీ చేసిన ప్రొసీడింగ్స్...
హైకోర్టు కీలక తీర్పు
4 నెలల్లో కొత్త జాబితా సిద్ధం చేయాలి
అప్పటివరకు పదోన్నతులు కల్పించవద్దు
హైకోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లా జడ్జీల సీనియారిటీ జాబితా విషయంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. వారి సీనియారిటీని నిర్ణయిస్తూ 2022 జనవరి 5న హైకోర్టు రిజిస్ట్రీ జారీ చేసిన ప్రొసీడింగ్స్, వాటిని నోటిఫై చేస్తూ అదే ఏడాది మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13ను రద్దు చేసింది. 2015 మార్చి 31న ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా 10 శాతం బదిలీల కోటా (యాక్సిలరేటెడ్) కింద నియమితులైన పిటిషనర్లు, 65 శాతం పదోన్నతి కోటా ద్వారా నియమితులైన ఇతర న్యాయాధికారుల విషయంలో తాజాగా సీనియారిటీ జాబితాను రూపొందించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. జాబితా తయారులో ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్-2007లోని 13(ఏ)ని అనుసరించి రోస్టర్ పాయింట్లు, ఉమ్మడి హైకోర్టు 2017 ఫిబ్రవరి 4న రూపొందించిన సీనియారిటీ జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. కొత్త సీనియారిటీ జాబితా తయారు చేసేవరకు 2022 జనవరి నాటి జాబితాకు అనుగుణంగా ఎలాంటి పదోన్నతులు కల్పించవద్దని హైకోర్టు రిజిస్ట్రీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గరిష్ఠంగా నాలుగునెలల్లోగా సీనియారిటీ జాబితాను తయారు చేసి, తదనంతరం చట్ట ప్రకారం పదోన్నతులు కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా 65 శాతం పదోన్నతి కోటా కింద నియమితులైన న్యాయాధికారుల కంటే 10 శాతం యాక్సిలరేటెడ్ కోటా కింద నియమితులైన తమను సీనియారిటీ జాబితాలో జూనియర్లుగా చేర్చడం ఏపీ జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్, సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధమంటూ న్యాయాధికారులు జి.రజని, జి.అన్వర్ బాషా, పి.భాస్కరరావు 2022లో వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు.
ఈ మూడు వ్యాజ్యాలు ఒకే అంశంతో ముడిపడి ఉండటంతో కలిపి విచారించిన ధర్మాసనం ఇటీవల తుది నిర్ణయం వెల్లడించింది. ‘‘65 శాతం పదోన్నతి కోటా, 10 శాతం యాక్సిలరేటెడ్ కోటా కింద జిల్లా జడ్జీల నియామకం కోసం ఒకే తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు కోటాల కింద ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యి 2015 నవంబరు 11న ఫలితాలు ప్రకటించారు. అనంతరం రెండు కోటాలకు సంబంధించి ఎంపిక జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. పోస్టింగ్ ఆర్డర్లు సైతం ఒకే రోజున ఇచ్చారు. అయితే రెండు కోటాలకు సంబంఽధించి నియామక ఉత్తర్వులు(జీవోలు) రాష్ట్ర ప్రభుత్వం రోజుల తేడాతో (65 శాతం కోటాకు 2016 జనవరి 20న, 10 శాతం కోటాకు 2016 ఫిబ్రవరి 8న )జారీ చేసిందనే కారణంతో 10 శాతం కోటా అభ్యర్థులను జూనియర్లుగా పరిగణించడానికి వీల్లేదు. అలా చేయడం ఏపీ జ్యుడీషియల్ సర్వీసు రూల్స్‌లోని నిబంధన 13(ఏ)కి విరుద్ధం. సీనియారిటీని రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా నిర్ణయించాలి తప్ప ప్రభుత్వ ఉత్తర్వుల తేదీ ఆధారంగా కాదు’’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.