Share News

High Court: వేలకోట్లు వెచ్చిస్తున్నా ఉద్దేశం నెరవేరట్లేదు

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:21 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 ఏళ్లుగా ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నా కేజీబీవీల ఏర్పాటు ఉద్దేశం నెరవేరట్లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

High Court: వేలకోట్లు వెచ్చిస్తున్నా ఉద్దేశం నెరవేరట్లేదు

  • కేజీబీవీల్లో శాశ్వత సిబ్బందిని నియమించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం

  • అర్హులైన బోధన సిబ్బంది లేకుండా నాణ్యమైన విద్య ఎలా సాధ్యమని ప్రశ్న

  • 14న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల కార్యదర్శికి ఆదేశం

  • రాష్ట్ర పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శికి కూడా

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 ఏళ్లుగా ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నా కేజీబీవీల ఏర్పాటు ఉద్దేశం నెరవేరట్లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వశిక్షా అభియాన్‌ పథకం కింద ఏర్పాటు చేసిన కేజీబీవీలలో శాశ్వత ప్రాతిపదికన అర్హులైన బోధనా సిబ్బందిని నియమించకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. శాశ్వత సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మైనార్టీ, అణగారినవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 2004లో ఈ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పాలసీలో శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది నియామకం గురించి ప్రస్తావించారని, మరోవైపు ప్రతి ఏడాది కాంట్రాక్ట్‌ పద్ధతిలో సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారని పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో స్థిరమైన వైఖరి కనిపించడంలేదంది. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారని తెలిపింది. తగినన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ సరైన వివరాలు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంది. వివరణ ఇచ్చేందుకు అక్టోబరు 14న తమ ముందు హాజరుకావాలని కేంద్ర మానవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శిని, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. విచారణను వచ్చేనెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టుదేవానంద్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీలు) 2023లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పిటిషనర్లను ఉద్యోగాలలో నుంచి తొలగించడాన్ని తప్పుపట్టారు. వారిని కొనసాగించాలని అధికారులను ఆదేశిస్తూ 2023 డిసెంబరు 5న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ అధికారులు 2024 జనవరిలో ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. ఈ అప్పీల్‌ గురువారం మరోసారి విచారణకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ వాదిస్తూ.. శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియామించుకొనే వెసులుబాటు కేంద్రం రూపొందించిన పాలసీలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ....బోధన సిబ్బందిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూచనలు చేసిందన్నారు. సర్వశిక్షా అభియాన్‌లో నడిచే విద్యాసంస్థలకు అయ్యే ఖర్చులో 60 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, కేంద్రం చెప్పినట్లు నడుచుకోకుంటే ఆ సొమ్మును విడుదల చేయరని తెలిపారు. ఇరువైపుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు తమ ముందు హాజరుకావాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ ముఖ్యకార్యదర్శిలను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - Sep 26 , 2025 | 05:21 AM