Share News

AP High Court: మద్యం బెయిల్‌ పిటిషన్లపై విచారణ ఆపండి

ABN , Publish Date - Oct 10 , 2025 | 05:07 AM

సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తాము నిర్ణయం తీసుకొనేంతవరకు మద్యం కేసులో బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరపకుండా వేచి ఉండాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారికి హైకోర్టు సూచించింది.

AP High Court: మద్యం బెయిల్‌ పిటిషన్లపై విచారణ ఆపండి

  • మా తుది నిర్ణయం వరకు ఆగండి.. ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచన

  • దర్యాప్తును బలహీన పర్చేలా ఏసీబీ కోర్టు ఉత్తర్వులు

  • విస్మయం కలిగించేలా న్యాయాధికారి తీరు

  • మిథున్‌రెడ్డి బెయిల్‌ ఉత్తర్వుల్లోని పలు అంశాల అమలును నిలుపుదల చేయండి

  • సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది లూథ్రా వాదన

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తాము నిర్ణయం తీసుకొనేంతవరకు మద్యం కేసులో బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరపకుండా వేచి ఉండాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారికి హైకోర్టు సూచించింది. గురువారం సీఐడీ/సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులోని పలు అంశాలు కేసు దర్యాప్తు మొత్తాన్ని బలహీనపర్చేలా ఉన్నాయని వాదనల సందర్భంగా లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. ఏసీబీ కోర్టు న్యాయాధికారి వైఖరి విస్మయానికి గురి చేస్తోందని చెప్పారు. మిథున్‌రెడ్డి విషయంలో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, చార్జిషీట్‌ దాఖలు చేయలేదని, అయినా కూడా బెయిల్‌ ఉత్తర్వుల్లో కేసు దర్యాప్తు ముగిసినట్లు ఏసీబీ కోర్టు పేర్కొందని తెలిపారు. దర్యాప్తు పూర్తి కాలేదని చెప్పి నిందితులు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఏసీబీ కోర్టు డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసి, మిథున్‌రెడ్డి విషయంలో మాత్రం దర్యాప్తు పూర్తి అయ్యినట్లు భిన్న వైఖరి తీసుకుందని పేర్కొన్నారు. మిథున్‌రెడ్డి మొదటి బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు ఆగస్టు 18న కొట్టివేసిందని, పదిరోజులు కూడా గడవక ముందే బెయిల్‌ కోసం మరో పిటిషన్‌ వేశారని చెప్పారు.


రెండు పిటిషన్ల మధ్య పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చిందన్నారు. ఎలాంటి షరతులు విధించకుండా మిథున్‌రెడ్డి పాస్‌పోర్ట్‌ విడుదలకు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. మిథున్‌రెడ్డి బెయిల్‌ ఉత్తర్వుల్లోని అంశాలను ఆధారంగా చేసుకొని తమకూ బెయిల్‌ మంజూరు చేయాలని ఇతర నిందితులు కోరే అవకాశం ఉందన్నారు. ఈ కేసులోని కొందరు నిందితుల బెయిల్‌ పిటిషన్లు ఏసీబీ కోర్టులో సోమవారం విచారణకు వస్తున్నాయని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈనేపథ్యంలో బెయిల్‌ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన పలు అంశాల అమలును నిలుపుదల చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశామని తెలిపారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి.. సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తాము నిర్ణయం తీసుకొనేంతవరకు బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరపకుండా వేచి ఉండాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారికి సూచించారు. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేశారు. మిథున్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు సెప్టెంబరు 29న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఈవ్యాజ్యం మరోసారి విచారణకు రాగా మిథున్‌రెడ్డి తరఫు న్యాయవాది నాగార్జున రెడ్డి స్పందిస్తూ.. వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరారు.

Updated Date - Oct 10 , 2025 | 05:09 AM