High Court: ఎమ్మెల్సీ వెంకటరమణ వ్యవహారంలో మండలి చైర్మన్
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:58 AM
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామా లేఖపై విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను...
అప్పీల్ విచారణ 18కి వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామా లేఖపై విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజ్ హైకోర్టులో అప్పీల్ వేశారు. గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మోషేన్‌రాజ్ తరఫు న్యాయవాది వై.రాజారత్నం వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఓ ఎమ్మెల్సీ రాజీనామాను ఉపసంహరించుకున్నారని వివరించారు. సింగిల్ జడ్జి తీర్పు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందన్నారు. కేసులో సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, విచారణను వాయిదా వేయాలని కోరారు. జయమంగళ వెంకటరమణ తరఫున న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఆయన సమర్పించిన రాజీనామా లేఖపై ఏడాది పాటు నిర్ణయం తీసుకోకుండా చైౖర్మన్ పెండింగ్‌లో పెట్టారన్నారు. రాజీనామా లేఖపై విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. కోర్టు ఆదేశాలను అనుసరించి చైర్మన్.. రాజీనామా లేఖలు సమర్పించిన ఎమ్మెల్సీలను పిలిచి విచారణ జరిపారని తెలిపారు. నిర్ణయం వెల్లడించాల్సి ఉందన్నారు. ఓ వైపు సింగిల్ జడ్జి తీర్పు అమలు చేస్తూనే చైర్మన్ మరోవైపు అప్పీల్ వేశారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు గవర్నర్లకు సంబంధించిందన్నారు. ప్రస్తుత కేసుకు ఆ తీర్పు వర్తించదన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.