Revenue Department: మీభూమిలో అడంగల్ మాయ
ABN , Publish Date - Nov 17 , 2025 | 03:37 AM
జగన్ సర్కారు రెవెన్యూ వ్యవస్థను భ్రష్ఠు పట్టించింది. రీ సర్వే, టైటిల్ చట్టం పేరుతో భూములు మాయం చేసింది. పారదర్శకతకు పాతరేసింది.
గ్రామ భూముల రికార్డులు దాచేశారు
‘మీ భూమి’ పోర్టల్‌లో కానరాని గ్రామ అడంగల్
అధికారులే చూసేలా బ్లాక్ చేసిన రెవెన్యూ
అందరికీ అన్ని రికార్డులూ అందుబాటులోకి..
కూటమి హామీ.. పలుమార్లు సీఎం పునరుద్ఘాటన
కానీ, పారదర్శకతపై సర్కారు స్ఫూర్తికి విఘాతం
గ్రామ అడంగల్ అందుబాటులో ఉంటే దొంగ పనులన్నీ బయటకొచ్చేస్తాయి
ఆ భయంతోనే నాడు దాచేసిన జగన్
అదే జాడ్యాన్ని రెవెన్యూ కొనసాగిస్తున్న వైనం
దీని వెనుక గూడుపుఠాణి ఏమైనా ఉందా?
రెవెన్యూ తీరుపై సర్వత్రా అనుమానాలు
క్వాంటమ్ కంప్యూటర్, వాట్సాప్ పరిపాలన, పారదర్శకత సేవలంటూ ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రెవెన్యూకు సంబంధించిన అన్ని రికార్డులూ అందుబాటులో ఉండాలనే ఆశయంతో తాను అధికారంలోకి రాగానే ‘మీ భూమి’ పోర్టల్‌ను నవీకరించింది. కానీ, ఈ పోర్టల్‌లో గ్రామ అడంగల్‌ను రెవెన్యూశాఖ దాచేసింది. గ్రామ భూముల రికార్డులను తెలిపే అడంగల్ అందరికీ అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఒక్క అధికారులు మాత్రమే చూడగలిగేలా పోర్టల్‌లో ‘మాయ’ చేస్తోంది. ఇంకా జగన్ సర్కారు నాటి జాడ్యాన్నే కొనసాగిస్తూ..కూటమి స్ఫూర్తినీ, సీఎం ఆదేశాలనూ తొక్కిపెడుతోంది. దీనివెనుక ఏదో గూడుపుఠాణి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘‘జగన్ సర్కారు రెవెన్యూ వ్యవస్థను భ్రష్ఠు పట్టించింది. రీ సర్వే, టైటిల్ చట్టం పేరుతో భూములు మాయం చేసింది. పారదర్శకతకు పాతరేసింది. మేం అధికారంలోకి రాగానే రెవెన్యూలో పారదర్శకత తీసుకొస్తాం. రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం...’’2024, మార్చిలో ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాల విడుదల సమయంలోనూ, ఆ తర్వాత కలెక్టర్ల సమావేశాల్లోనూ సీఎం ఇదే మాట చెప్పారు. అయితే, దేవుడు వరమిచ్చినా... పూజారి కరుణించలేదన్న చందంగా రెవెన్యూశాఖ వ్యవహరిస్తోంది. భూముల విషయంలో పారదర్శకత తీసుకొస్తామన్న ప్రభుత్వ హామీలను ఆచరణలోకి తీసుకురావాల్సిన రెవెన్యూశాఖ.... ఇంకా జగన్ సర్కారు నాటి భ్రష్ఠ సంస్కృతినే కొనసాగిస్తోంది. గ్రామభూముల రికార్డులకు సంబంధించిన అడంగల్‌ను అందుబాటులో లేకుండా సాప్ట్‌వేర్‌తో బ్లాక్‌చేసింది. ఇదేదో ఇప్పుడు చేసింది కాదు... జగన్ జమానాలో 2023 నుంచే బ్లాక్ చేస్తున్నారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. దీంతో గ్రామంలో ప్రభుత్వ, అసైన్డ్, షరతుగల పట్టా, చుక్కల భూములు, ఇనాం భూములు, గ్రామకంఠాల పరిస్థితి ఏమిటో సగటు పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూశాఖ భావిస్తున్నట్లుంది. అందుకే గ్రామ అడంగల్ ‘మీ భూమి’ పోర్టల్‌లో ఓపెన్ కాకుండా బ్లాక్‌చేశారా? లేక ఇంకా మరే దైనా చీకటి కోణం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కారు వైఖరిని రెవెన్యూశాఖ కొనసాగించాలని అనుకుంటున్నదా? అందుకే దానిని బ్లాక్‌చేసిందా.. అనే అనుమానాలను రెవెన్యూ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
బాబు విజన్‌ను ఖూనీ చేసిన రెవెన్యూ
ప్రజలు తమ అవసరాల కోసం రోజువారీగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగొద్దనేది సీఎం చంద్రబాబు ఆలోచన. రెవెన్యూ ఆఫీసులకే పరిమితమైన ప్రజల భూమి రికార్డులు అందరికీ అందుబాటులో ఉండాలని 2014లోనే చంద్రబాబు ప్రభుత్వం ‘మీ భూమి’ పోర్టల్‌ను ఆధునీకరించింది. భూమి రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ పోర్టల్‌లోని డేటాను చట్టబద్ధం చేసి, అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ డేటాను బ్యాంకులు, రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. తనఖా రుణాల మంజూరు, పంట రుణాలకు ‘మీ భూమి’ రికార్డునే ప్రమాణంగా తీసుకుంటున్నారు. ఇందులో వ్యక్తులకు సంబంధించిన ఆర్‌వోఆర్ 1బీ, అడంగల్‌తోపాటు గ్రామ అడంగల్ కూడా ఉన్నాయి. గ్రామ అడంగల్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు భూములు, వాటి ఎఫ్‌ఎమ్‌బీలు ఉంటాయి. అటవీ, దేవదాయ భూముల డేటా కూడా ఉంటుంది. సుదీర్ఘకాలం ప్రభుత్వ భూమి అని అడంగల్‌లో ఉన్నదాన్ని రాత్రికి రాత్రే ప్రైవేటు ఖాతా కింద చూపినా, అటవీ, దేవదాయ, చుక్కల భూమిని జిరాయితీగా చూపించినా గ్రామ అడంగల్‌లో తెలిసిపోతుంది.
నాడంతా అరాచకం..
జగన్ ప్రభుత్వంలో 2020లో భూముల సర్వేను చేపట్టారు. ఆ తర్వాత టైటిల్ చట్టం తీసుకొచ్చి అమలు చేసేందుకు హడావుడి చేశారు. ఆ తర్వాత చుక్కల భూములు, షరతుగల పట్టా భూములు, ఇనాం భూములు, గ్రామకంఠాలు, పోరంబోకు, ప్రభుత్వ భూములపై ఉన్న వివాదాలకు సంబంధించి అనేక జీవోలు ఇచ్చారు. ప్రజలకు హక్కులు ఇచ్చే పేరిట చట్టబద్ధమైన, కఠినమైన నిబంధనలను సరళీకరించారు. అసలు భూమిపై పొజిషన్ ఉంటే చాలన్నట్లుగా నాటి రెవెన్యూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాతే వాటికి అనుగుణంగా ‘మీ భూమి’ పోర్టల్‌లో గ్రామ అడంగల్‌ను బ్లాక్ చేశారు. అంతే.... గ్రామస్థాయిలో ప్రభుత్వ భూముల పరిస్థితి ఏమిటో స్థానికులకు కూడా తెలిసే అవకాశం లేకుండా పోయింది. వెబ్‌ల్యాండ్ లాగిన్ ఐడీలను దుర్వినియోగం చేసి భూ రికార్డులను తారుమారు చేశారంటూ రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఇస్తున్న ఉత్తర్వులు ప్రతీరోజు వెలుగులోకి వస్తున్నాయి. కానీ రెవెన్యూశాఖ మాత్రం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. గ్రామ అడంగల్ రహస్య పత్రంగా, కేవలం అధికారి చూడగలిగే రికార్డుగా ఉన్నంతకాలం పారదర్శకత అనేది ఎండమావిగానే ఉంటుందని రెవెన్యూ నిపుణుడు సుబ్బారావు తెలిపారు. ’’ప్రజలకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని సీఎం చెబుతున్నారు. భూమి రికార్డులనేవి ప్రజలందరికీ తెలియాల్సినవి. అందుకే వెబ్‌ల్యాండ్, మీభూమి పోర్టల్ తీసుకువచ్చారు. కానీ జగన్ సర్కారు వాటిని దుర్వినియోగం చేసింది. ఇప్పటికీ రెవెన్యూశాఖలో ఇసుమంతైన మార్పు లేకపోవడం శోచనీయం. గ్రామ అడంగల్‌ను రెవెన్యూ అధికారి ఒక్కరే చూసే డాక్యుమెంట్‌గా మార్చడంలోనే ఏదో గూడుపుఠాణి ఉంది. అదేమిటో కనిపెడితే, దాని వెనుక అసలు రహస్యాలు, అందులోని తప్పులు బయటకొస్తాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప రెవెన్యూశాఖ దారికి రాదు.’’ అని సుబ్బారావు అభిప్రాయపడ్డారు.
కూటమి వచ్చినా అవే పోకడలు..
ఆనాడు జగన్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు, రైతులకు భూముల విషయంలో జరిగిన అన్యాయాలే కూటమి గె లుపున కు దారులేశాయి. కూటమి సర్కారు వచ్చి 16 నెలలు దాటినా రెవెన్యూ శాఖ పారదర్శకత వైపు ఒక్క అడుగు కూడా వేయడం లేదు. ప్రభుత్వం పారదర్శకత గురించి జపిస్తుంటే రెవెన్యూశాఖ మాత్రం ‘రహస్య’మంత్రం జపిస్తున్నట్లుగా ‘మీ భూమి’ సైట్‌ను నిర్వహిస్తోంది. పారదర్శకత అన్నా, సీఎం హామీలన్నా తనకు పెద్దగా పట్టింపు లేదని రెవెన్యూశాఖ అనేకసార్లు స్వయంగా నిరూపించింది. జగన్ ప్రభుత్వంలో జరిగిన భూముల అక్రమాలపై నిగ్గుతేల్చి బాధ్యులైన ప్రైవేటు వ్యక్తులు, అధికారులపై చర్యలు తీసుకునేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం గత ఏడాది రెవెన్యూశాఖను ఆదేశించారు. ఇంతవరకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటే జరగలేదు.