Heritage Villages: కూచిపూడి, ఏటికొప్పాక గ్రామాలకు మహర్దశ
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:33 AM
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన(ఆర్‌జీఎ్‌సఏ) పథకం ద్వారా రాష్ట్రంలోని హెరిటేజ్ గ్రామాలైన కూచిపూడి, ఏటికొప్పాకతోపాటు అరకులోనూ ఆదాయ పెంపు ప్రాజెక్టులను మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఆర్‌జీఎ్‌సఏ ఆధ్వర్యంలో ఆదాయ పెంపు ప్రాజెక్టులు మంజూరు
అరకులోనూ ఐకానిక్ వెదురు క్యాంపస్ ఏర్పాటుకు అనుమతి
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన(ఆర్‌జీఎ్‌సఏ) పథకం ద్వారా రాష్ట్రంలోని హెరిటేజ్ గ్రామాలైన కూచిపూడి, ఏటికొప్పాకతోపాటు అరకులోనూ ఆదాయ పెంపు ప్రాజెక్టులను మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌జీఎ్‌సఏ ద్వారా వినూత్నమైన ఆదాయ వనరుల పథకాలను గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రతిపాదనలు కోరింది. మన రాష్ట్రం నుంచి ప్రతిపాదించిన నాలుగు ప్రాజెక్టుల అమలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అరకులో రూ.5 కోట్లతో క్యాంపింగ్ అండ్ కార్వాన్ గ్రామాలు, వెదురుతో ఐకానిక్ నిర్మాణాలు చేపట్టే ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించింది. కూచిపూడిలో సంస్కృతిని పరిరక్షించేందుకు, స్థానికులకు సుస్థిరమైన జీవనోపాధులు కల్పించేందుకు, అక్కడ మౌలిక వసతులను కల్పించడంతోపాటు స్వయం సహాయక సంఘాలు, యువత, స్థానిక కళాకారుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు రూ.3 కోట్లు ఖర్చు చేయనున్నారు. బొమ్మలకు ప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక గ్రామంలో సంప్రదాయమైన బొమ్మల తయారీని ప్రోత్సహిస్తారు. వారికి మార్కెట్ సౌకర్యంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు మరో రూ.3 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మూడు ప్రాజెక్టుల అమలు బాధ్యతలను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతోపాటు గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం 60 లక్షల కుటుంబాల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రచారం నిమిత్తం 6 వేల మంది కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్(సీఆర్‌పీ)లను నియమించుకునేందుకు ప్రతిపాదించగా, 5.5 వేలమందిని నియమించుకునేందుకు కేంద్రం రూ.5.50 కోట్లు మంజూరుచేసింది. ఈ ప్రాజెక్టును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించనుంది.