Water : అటు కృష్ణమ్మ.. ఇటు తుంగభద్ర
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:01 AM
ఓ పక్క కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతుంటే.. మరోపక్క తుంగభద్రమ్మ ఉరకలేస్తూ పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లోకి దూసుకు వస్తోంది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలు 1855 క్యూసెక్కులు వస్తుండగా.. తుంగభద్ర డ్యాం నీరు లింక్ చానల్ ద్వారా 105 క్యూసెక్కులు పీఏబీఆర్‌లోకి వస్తుండడంతో నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 430.400...
అటు కృష్ణమ్మ.. ఇటు తుంగభద్ర
పీఏబీఆర్‌కు పెరిగిన ఇనఫ్లో
కూడేరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఓ పక్క కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతుంటే.. మరోపక్క తుంగభద్రమ్మ ఉరకలేస్తూ పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లోకి దూసుకు వస్తోంది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలు 1855 క్యూసెక్కులు వస్తుండగా.. తుంగభద్ర డ్యాం నీరు లింక్ చానల్ ద్వారా 105 క్యూసెక్కులు పీఏబీఆర్‌లోకి వస్తుండడంతో నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 430.400 అడుగుల వద్దకు చేరుకొని, 2.924 టీఎంసీలు నిల్వ ఉందని ఇరిగేషన ఏఈ లక్ష్మీదేవి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పీఏబీఆర్‌లోకి కృష్ణా జలాలు రాగా, లింక్ చానల్ నుంచి గత ఐదు రోజులుగా తుంగభద్ర నీరు వస్తుండటంతో పీఏబీఆర్ నీటితో కళకళలాడుతోంది.
బీటీపీకి వరద
గుమ్మఘట్ట, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులలో ఒకటైన భైరవానితిప్ప ప్రాజెక్టుకు వరదనీటి ఇనఫ్లో పెరుగుతోంది. కర్ణాటక ప్రాంతాల్లో గత మూడురోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో వేదావతి నది వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. దీంతో బీటీపీకి వరదనీటి ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. 16.55 అడుగుల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టులో గతంలో 16.41 అడుగుల నీరు నిల్వ ఉండేది. మూడురోజులుగా కురిసిన వర్షాలకు ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులో 16.48 అడుగుల నీటిమట్టానికి చేరుకుందని అధికారులు తెలిపారు. వేదావతినదిలో దాదాపు 1500 క్యూసెక్కుల మేర వరదనీటి ఇనఫ్లో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రెండు టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం ఒక టీఎంసీ మేర వరదనీరు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.