ఇవిగో సమస్యలు
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:58 PM
జిల్లాను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది.
- రైతులకు పూర్తిగా అందని యూరియా
- తేలని జిందాల్ నిర్వాసితుల వ్యవహారం
- ముందుకు కదలని సాగునీటి ప్రాజెక్టులు
- పలు శాఖల్లో జిల్లాస్థాయి అధికారుల కొరత
- నేడు నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
విజయనగరం కలెక్టరేట్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. జిందాల్ వ్యవహారం నలుగుతోంది. సాగునీటి ప్రాజెక్టుల పనులు మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగుల వెనక్కి అన్న చందంగా ఉన్నాయి. కీలకమైన శాఖలు ఇన్‌చార్జి అధికారులతో సాగుతున్నాయి. మరోవైపు అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ తరుణంతో వీటిని చక్క దిద్దాల్సిన బాధ్యత నూతన కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిపై ఉంది. శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్న ఆయనకు ఎన్నో సమస్యలు.. మరోన్నె సవాల్ స్వాగతం పలుకుతున్నాయి.
సాగు నీటి ప్రాజెక్టులు..
ఉమ్మడి విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 19,85,221 ఎకరాల ఆయకట్టుకుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో పనులకు ప్రారంభంలో రూ.1127.58 కోట్ల వ్యయంతో పాలనా అనుమతి లభించింది. ఇప్పటివరకూ రూ.900కోట్ల వరకూ వెచ్చించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పనులు పూర్తి కాకపోవడంతో ఏటా ఖరీఫ్‌లో 80 వేల ఎకరాల ఆయకట్టుకు కూడా సాగునీరు అందించడం గగనంగా మారింది. ఇక తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుది దయనీయం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కాంట్రాక్టర్‌కు రూ.18 కోట్ల వరకూ బకాయిలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.739 కోట్లకు సంబంధించి పాలనా ఆమోదం లభించింది. ఇప్పటివరకూ రూ.310 కోట్ల వరకూ పనులు మాత్రమే జరిగినట్టు తెలుస్తోంది. మడ్డువలస రిజర్వాయర్‌ది అదే పరిస్థితి. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ బాలారిష్టాలు దాటడం లేదు.
యూరియా ఎక్కడ?
జిల్లాలోని రైతులకు యూరియా పూర్తిస్థాయిలో దొరకడం లేదు. యూరియా కొరత లేదని అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రెండో విడతలో యూరియా వేసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో జిల్లాలోని అనుకున్న స్థాయిలో యూరియా నిల్వలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
జిందాల్ సమస్య పరిష్కారమయ్యేనా?

శృంగవరపుకోట మండల పరిధిలో జిందాల్‌కు సేకరించిన భూమి
18 ఏళ్ల కిందట జిందాల్ కంపెనీ ఏర్పాటు చేస్తామని ఎస్.కోట మండలంలోని రైతుల నుంచి భూములు తీసుకున్నారు. అయితే సంవత్సరాలు గడిచినా జిందాల్ కంపెని ఏర్పాటు చేయకపోవడంతో తమ భూములును వెనక్కి ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ రఘురాజు తోపాటు రైతు సంఘ నాయకులు,నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అప్పట్లో సుమారు 1,166 ఎకరాలను ప్రభుత్వం జిందాల్‌కు అందజేసింది. ఈ భూముల్లో 180 ఎకరాలను జిందాల్ యాజమాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇది కాకుండా 375 మంది రైతుల నుంచి 834 ఎకరాల అసైన్డ్ భూమిని, 151 ఎకరాల ప్రభుత్వ భూమిని జిందాల్‌కు కేటాయించారు. సకాలంలో కంపెనీ ఏర్పాటు చేయకపోవడంతో తమ భూములను వెనక్కి ఇవ్వాలని కొందరు రైతులు కోరుతున్నారు. ఇప్పుడు ఇది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమస్యకు కలెక్టర్ చెక్ పెట్టాల్సి ఉంది.
కొరవడిన సమన్వయం
జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది. ప్రస్తుత కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఈ ఏడాది జూన్2న కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా అధికారుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులను ‘మీరు ఏమైనా పెద్ద తోపులా? వేషాలు వేస్తున్నారా? నా అనుమతి లేకుండా కలెక్టరేట్‌లో జిల్లా మంత్రితో సమావేశాలు పెడతారా? మీకు ఎంత ధైర్యం? ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా జిల్లాలో ఏ ప్రజా ప్రతినిధిని కలవడానికి వీల్లేద’ంటూ హెచ్చరించారు. దీంతో కలెక్టర్‌కు మంత్రి శ్రీనివాస్ మద్య సమన్వయం లేనట్లు బయిపడింది. అలాగే పలువురు శాసనసభ్యులు, కలెక్టర్ మద్య ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజుల కిందట జరిగిన తహసీల్దార్ల బదిలీల్లో తమకు ప్రాధన్యం లేకుండా పోయిందని ప్రజా ప్రతినిధులు గుసగుసలాడుకున్నారు. కిందిస్థాయి నాయకులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు విమర్శలు వచ్చాయి. జిల్లాలోని కీలకమైన శాఖల్లో ఉన్నత అధికారులు లేరు. జిల్లా పౌర సరఫరాల అధికారి, గ్రామీణ మంచి నీటి విభాగం ఎస్‌ఈ, పశుసంవర్ధక శాఖ జేడీ, గృహ నిర్మాణ శాఖ పీడీతోపాటు చాలా శాఖల్లో కీలకమైన పోస్టులు ఇన్‌చార్జీలతోనే సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు ముందుకు సాగడం లేదు.
భూసమస్యలు..
జిల్లాలోని భూసమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో రెవెన్యూ సిబ్బంది పనితీరుపై రైతుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. వారసత్వంగా వచ్చిన భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయకుండా అధికారులు తిప్పుతున్నారంటూ రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో కంపూటర్ ఆపరేటర్లు ఇష్టాసారంగా ఆన్‌లైన్‌లో పేర్ల మార్పులో కీలక పాత్రపోషిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్ల డిజిటల్ సిగ్నేచర్‌కు చెందిన కీ వీరు వద్ద ఉండటంతో ఇటువంటి సంఘటలు చోటు చేసుకుంటున్నాయని రైతులు బహిరంగగా ఆరోపిస్తున్నారు. గత వైసీపీ హయాంలో నిర్వహించిన భూ రీసర్వేలో తప్పులు ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి 20 వేల అర్జీలు వచ్చాయి. వీటి పరిష్కారం మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. గత వైసీపీ హయాంలో జిల్లాకు 202 రోవర్లు కేటాయించారు. వీటిలో 60రోవర్లు పని చేయడం లేదు. 138 మాత్రమే పని చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో రోవర్లు లేకపోవడంతో గ్రామ సర్వేయర్లు ఇబ్బంది పడుతున్నారు.