చేనేతకు చేయూత
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:46 AM
చేనేత కార్మికులకు చేయూత అందించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం చిన్నాపురం గ్రామంలో సోమవారం చేనేతల అభినందన సభ నిర్వహించారు. వంద అడుగుల చేనేత చీరను ప్రదర్శించారు.
- ‘నేతన్న భరోసా’ కింద ఏటా రూ.25వేలు
- చేనేత కుటుంబానికి 200 యూనిట్ల కరెంట్ ఉచితం
- పవర్‌లూమ్ మగ్గాలు ఉన్నవారికి నెలకు 500 యూనిట్లు
-మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):
చేనేత కార్మికులకు చేయూత అందించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం చిన్నాపురం గ్రామంలో సోమవారం చేనేతల అభినందన సభ నిర్వహించారు. వంద అడుగుల చేనేత చీరను ప్రదర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ‘నేతన్న భరోసా’ కింద ఏటా రూ.25వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంట్లో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికీ నెలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పారు. తద్వారా వారికి ఏడాదికి రూ.15వేల భారం తగ్గుతుందన్నారు. పవర్‌లూమ్ మగ్గాలు ఉన్నవారికి నెలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఎన్నికల హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు. గత వైసీపీ పాలనలో చేనేత కార్మికులు ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకుని జీవించారన్నారు. కొందరు చేనేత కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని గుర్తు చేశారు. చేనేతను ఆదుకునేందుకు ప్రతి శనివారం అందరూ చేనేత వస్త్రాలు ధరించాలన్నారు. కృష్ణాజిల్లాలో అత్యంత ప్రజాధరణ పొందిన కలంకారీ వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయాలు పెంచుతామని చెప్పారు. కార్మికులు నేసిన వస్త్రాలను సొసైటీలకు ఇస్తున్నారని, సొసైటీల్లో అప్పులు పేరుకుపోయి కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సొసైటీలలోని బకాయిలు కూడా రద్దు చేస్తామన్నారు. యువతకు చేనేతపై శిక్షణ ఇచ్చేందుకు చిన్నాపురంలో ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, చిన్నాపురం గ్రామ సర్పంచ్ కాగిత గోపాలరావు, జనసేన బందరు మండల అధ్యక్షుడు గల్లా తిమోతి, బీజేపీ మండల అధ్యక్షుడు కంచర్లపల్లి రామారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు పినిశెట్టి నిరంజనరావు, చేనేత కార్మిక సంఘ నాయకులు విప్పంశెట్టి బసవయ్య, టి.నరసింహారావు, విస్సంశెట్టి బాబు, గొర్రెకృష్ణ, ఏడి తదితరులు పాల్గొన్నారు.