Share News

Return Traffic: పండగైపోయింది.. పోదాం పద..!

ABN , Publish Date - Oct 06 , 2025 | 03:10 AM

పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ముగిశాయి. ఉద్యోగులకు వారాంతపు సెలవులు కూడా పూర్తయ్యాయి. దీంతో హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు....

Return Traffic: పండగైపోయింది.. పోదాం పద..!

  • సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణాలు

  • విజయవాడ- హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌

  • టోల్‌ప్లాజాల దగ్గర బారులు తీరిన వాహనాలు

చౌటుప్పల్‌/నందిగామ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ముగిశాయి. ఉద్యోగులకు వారాంతపు సెలవులు కూడా పూర్తయ్యాయి. దీంతో హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాల వద్ద పెద్దసంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని పంతంగి టోల్‌ప్లాజా మీదుగా 30వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ, ఆదివారం ఒక్కరోజే 45వేలకు పైగా వాహనాలు ప్రయాణించాయని టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు. కాగా, దసరా పండుగ తిరుగు ప్రయాణాల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు 1,050 స్పెషల్‌ బస్సులు ఏర్పాటు చేశామని టీజీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సోమవారం కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతామని పేర్కొంది.

నందిగామ బైపా్‌సలో ట్రాఫిక్‌ జామ్‌

జాతీయ రహదారుల శాఖ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నందిగామ వై జంక్షన్‌ వద్ద బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు ఆకస్మికంగా ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా సందర్భంగా గతవారం హైదరాబాద్‌ నుంచి వేలాది వాహనాలు విజయవాడ వైపు వచ్చాయి. రహదారిపై గుంతల వల్ల భారీగా తరలివస్తున్న వాహనాలు నందిగామ సమీపంలో గంటల తరబడి ఆగిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పండుగ సెలవులు ముగిసిన తర్వాత వారంతా అదే రోడ్డుపై తిరుగు ప్రయాణం చేస్తారని తెలిసినా అధికారులు మరమ్మతులు చేపట్టక పోవడంతో వాహనదారులు మరోసారి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రధాన కాంట్రాక్టర్‌, సబ్‌ కాంట్రాక్టర్‌ మధ్య ఏర్పడిన ఆర్థిక వివాదాలతోనే నిర్మాణ పనులు నిలిచిపోయినట్లు తెలిసింది.

Updated Date - Oct 06 , 2025 | 03:10 AM