Heavy Rainfall: నేడు, రేపు భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:39 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడి, శనివారం ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.
కొన్ని జిల్లాల్లో అతి భారీగా వానలు
బంగాళాఖాతంలో అల్పపీడనం...నేడు వాయుగుండంగా మార్పు
రేపు ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరంపైకి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడి, శనివారం ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇంకొక ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో గురువారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అనేకచోట్ల గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం కోస్తాలోని అన్ని జిల్లాలు, రాయలసీమలో నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో భారీవర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు ఈనెల 29 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
గోదావరిలో 6 లక్షల క్యూసెక్కుల వరద
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరిలో నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. ఉప నదులు గోదావరిలో కలుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 36.30 అడుగులకు చేరింది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 6,09,380 క్యూసెక్కుల వరదను ప్రాజెక్టు 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం స్పిల్‌వే ఎగువన నీటిమట్టం 30.740 మీటర్లు, దిగువన 21.600 మీటర్లుగా నమోదైంది.