Heavy Rains Submerge: పొలం చెరువైంది
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:58 AM
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో పొలాలు చెరువుల్లా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ..
68,441 హెక్టార్లలో నీట మునిగిన పంటలు
భారీ వర్షాలు, వరదలతో రైతన్నకు కష్టం
పంటలు మునిగినా.. దెబ్బతినలేదు: వ్యవసాయ శాఖ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్) : అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో పొలాలు చెరువుల్లా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గురువారం సాయంత్రం వరకు 68,441 హెక్టార్లలో పంటలు ముంపులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 13 ఉమ్మడి జిల్లాల్లోని 79 మండలాల్లో వరి పంట 59,473 హెక్టార్లలో ముంపులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా పత్తి 7,664, మినుము 549, పెసర 397, వేరుశనగ 257, కంది 51, మొక్కజొన్న 26, సజ్జ 24, నారుమళ్లు 18 హెక్టార్లలో మునిగినట్లు అంచనా వేశారు. గుంటూరు జిల్లాలో 28,645 హెక్టార్లలో, బాపట్ల 16,325, పశ్చిమ గోదావరి 7,555, ఎన్టీఆర్ 4,619, కృష్ణా 3,621, పల్నాడు 2,561, ఏలూరు 2,050, కోనసీమ 1,080, కాకినాడ 898, కర్నూలు 649, తూర్పుగోదావరి 250, అనంతపురం 143, కడప జిల్లాలో 45 హెక్టార్లలో పంటలు ముంపునకు గురైనట్లు తేల్చారు. వరద ముంపు ప్రాంతాల్లో పంటలు మునిగినా, పూర్తిగా దెబ్బతినలేదని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కాగా, భారీగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏలూరు జిల్లా యంత్రాగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌తో పాటు, డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. యానాం, ఉమ్మడి తూర్పులో పలుచోట్ల ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. పిఠాపురంలో సుద్దగడ్డకు వరద పోటెత్తింది. రోడ్లపై వరద నీరు ప్రవహించగా పొలాలు ముంపులో చిక్కుకున్నాయి. గొల్లప్రోలు పట్టణ శివారు జగనన్న కాలనీకి వెళ్లే రహదారిపైకి గురువారం సుద్దగడ్డ వరద నీరు భారీగా నీరు చేరడంతో నిచ్చెన సహాయంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఎక్కి, రహదారి అవతల వైపునకు చేరుకుని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ముంపునకు గురికావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో సుబ్బమ్మ అనే మహిళ ఇంటి పైకప్పు కుంగి గురువారం మధ్యాహ్నం కూలిపోయింది. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.