Weather Depression: ముంచిన వాన
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:03 AM
దిత్వా తుఫాను అవశేషంగా కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎడతెరపిలేని వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
దిత్వా తుఫాను అవశేషంగా కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరులో ఏ వీధి చూసినా మోకాలిలోతు నీళ్లు పారుతున్నాయి.ఆ జిల్లాలో 90 శాతానికిపైగా చెరువులు నిండిపోవడంతో అలుగులు దాటి పొలాలపైకి నీరు పారుతోంది. పలు చోట్ల గండ్లు కొట్టారు. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి వద్ద నెల్లూరు కాలువలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.
నేటి నుంచి పెరగనున్న చలి
అల్పపీడనం గురువారం పూర్తిగా బలహీనపడింది. అయినప్పటికీ బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమగాలులకు నెల్లూరు, తిరుపతి, వాటికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిశాయి. శుక్ర, శనివారాలు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ బలహీనపడిన నేపథ్యంలో ఉత్తరాది నుంచి చలిగాలుల జోరు పెరిగింది.