Share News

Heavy Rainfall: కర్నూలు, అనంతలో భారీ వర్షం

ABN , Publish Date - Sep 12 , 2025 | 06:26 AM

అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో...

Heavy Rainfall: కర్నూలు, అనంతలో భారీ వర్షం

  • పొంగిపొర్లిన వాగులు, వంకలు

  • ఉధృతంగా వేదవతి, చిత్రావతి, హంద్రీ, కుందు

  • వందల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

  • నిలిచిన రాకపోకలు

కర్నూలు, నంద్యాల, అనంతపురం అర్బన్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో 12.9, అనంతలోని యల్లనూరు మండలంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల పంటలు నీట మునిగాయి.


అనంతపురం జిల్లాలో...

కణేకల్లు-మాల్యం మధ్యలో వేదవతి నది ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో కుషావతి, చిత్రావతి నదులు పరవళ్లు తొక్కాయి. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామ సమీపంలోని కోన రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద జలపాతం జీవం పోసుకుంది. కంది, వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కణేకల్లు మండలంలో 16 హెక్టార్లల్లో రూ.4.05 లక్షల విలువైన వరి పంట దెబ్బతింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 83.81 హెక్టార్లల్లో రూ.20.95 లక్షల విలువైన వేరుశనగ పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. గుత్తి, యాడికి మండలాల్లో 3.53 హెక్టార్లల్లో రూ.9 లక్షల విలువైన టమోటా పంట దెబ్బతింది. శింగనమల మండలం గోవిందరావు పేటలో 3 ఎకరాల్లో కోత కోసిన వేరుశగన పంట వర్షానికి కొట్టుకుపోయింది.


కర్నూలు జిల్లాలో...

కర్నూలులో హంద్రీ నదీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక్కెర వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పెంచికలపాడు దగ్గర బ్రిడ్జిపై వరద పోటెత్తింది. ఈ బ్రిడ్జి వద్ద ఉదయం గూడూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. కుందూ నది ఉధృతంగా ప్రవహించింది. కల్వటాల వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించింది. కొండ ప్రాంతాల్లో నుంచి వాగుకు పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో నెల్లూరు-ముంబై హైవేపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆత్మకూరు పట్టణంలోని చాలా వీధులు జలమయమయ్యాయి. ఆత్మకూరు మండలంలోని గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించింది. చాగలమర్రి, ప్యాపిలి మండలాల్లో పంటలు నీట మునిగాయి.

గరిష్ఠ నీటి మట్టానికి గాజులదిన్నె ప్రాజెక్టు

గాజులదిన్నె ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 377 మీటర్లు, నీటి నిల్వ సామర్థ్యం 4.50 టీఎంసీలు. హంద్రీ నదిలో భారీగా వరద ప్రవహిస్తోంది. హంద్రీ నీవా కాలవ నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో డ్యాంలోకి 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా గేట్లేత్తే అవకాశం ఉందని హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ, టీబీపీ ఎల్లెల్సీ ఈఈ పాండురంగయ్య తెలిపారు.


అల్పపీడనంతో నేడు, రేపు భారీ వర్షాలు..

అమరావతి, విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూర ు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. గురువారం సాయంత్రం వరకు నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 60.2, ఎనకండ్లలో 52.2, పాములపాడులో 38.7, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 34.7, విజయనగరం జిల్లా గొల్లపాడులో 33.2 మిల్లీమీటర్ల వాన పడింది. కాగా, వాయవ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణకు వాతావరణం అనుకూలంగా మారుతోంది.

Untitled-5 copy.jpg


కాకినాడ తీరం కల్లోలం

కొత్తపల్లి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడతీరం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఉప్పాడ గ్రామంలోకి దూసుకొస్తున్నాయి. 5-6 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడుతుండటంతో కొత్తపట్నంలోని మత్స్యకారుల ఇళ్లల్లోకి నీరు చేరింది. ప్రాథమిక పాఠశాల నీట మునిగింది. ఉప్పాడ బీచ్‌రోడ్డు వంద అడుగుల పొడువునా కోతకు గురైంది. పరిశీలించేందుకు వెళ్లిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్‌ వర్మ బీచ్‌రోడ్డులో ఉవ్వెత్తున ఎగసిన కెరటాల్లో చిక్కుకుపోయారు. అక్కడి నుంచి వర్మ ధైర్యంగా తప్పించుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Untitled-5 copy.jpg

Updated Date - Sep 12 , 2025 | 06:33 AM