Heavy Rain: నేడు కోస్తాలో అతిభారీ వర్షాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:55 AM
కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి.
సీమలో పలుచోట్ల భారీ వర్షాలు
15-16 నాటికి పూర్తిగా నిష్క్రమించనున్న నైరుతి
ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూలంగా వాతావరణం
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోకి నీరు... నిలిచిన ఓపీ సేవలు
అమరావతి, విశాఖపట్నం, ఏలూరుసిటీ, భీమవరం రూరల్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు కోస్తాంధ్రపైకి వీయడంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ విస్తారంగా వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏలూరు జిల్లా లింగపాలెంలో 74.25, చింతలపూడిలో 68.75, బాపట్లలో 62.5, విజయనగరం జిల్లా పులిగుమ్మిలో 61, కృష్ణా జిల్లా ఉయ్యూరులో 60.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అనకాపల్లి నుంచి నెల్లూరు జిల్లా వరకూ, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా సోమవారం దేశంలో అనేక ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూలంగా దక్షిణాదిలో గాలుల దిశ మారింది. ఈనెల 15 లేదా 16వ తేదీన దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలుగుతాయని, అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు.
ఏలూరు జిల్లాలో కుంభవృష్టి
సోమవారం తెల్లవారుజాము నుంచి కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. ఏలూరు నగరంలో రహదారులన్నీ జలమయం అయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ విభాగంలోకి నీరు చేరడంతో సేవ లు నిలిచిపోయాయి. ఆస్పత్రి ఎదుట డ్రెయిన్ పుట్‌పాత్‌పై సిమ్మెంట్ దిమ్మలు లేకపోవడంతో డ్రెయిన్‌లో పడి ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలో అత్యధికంగా కొయ్యలగూడెం మండలంలో సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 91.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కన్నాపురం వద్ద తూర్పు, పడమటి కాలువలు ఉధృతంగా ప్రవహించాయి. జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షం... వరిసాగుకు గండం
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉండి, పాలకొల్లు, ఆకివీడు, భీమవరం పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. వరిసాగు ఈనిక దశలో ఉన్నందున వర్షం గండంగా మారింది. ఈదురుగాలులు లేనందున ఎక్కడా నష్టం వాటిల్లలేదు. వర్షపు నీరు చేలల్లోకి భారీగా చేరింది. జిల్లాలో 2 లక్షల ఎకరాల సాగు ఈనిక, పొట్ట వివిధ దశల్లో ఉంది. ఈ సమయంలో వర్షాలు నష్టం చేస్తాయని రైతులు ఆందోళనలో ఉన్నారు.